Formula E-Race Case: కేటీఆర్‌పై కేసు నమోదు.. బీఆర్ఎస్ నేతల తర్జనభర్జన!

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ1గా చేయడంతో పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.

Update: 2024-12-20 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ1గా చేయడంతో పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఆయనను అరెస్ట్ చేస్తే ఏ విధంగా స్పందించాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేసినా కూడా స్పందించకుంటే మరోరకమైన సంకేతాలు వెళ్తాయని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ భవన్ వద్ద గురువారం సాయంత్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్ఠి బొమ్మ దహనం చేశారు. శుక్రవారం మరిన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. పార్టీ కార్యక్రమాలపై ఆయా జిల్లా నాయకులకు సంకేతాలు కూడా వెళ్లినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ విచారణకు శాంతియుతంగా సహకరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో..

ఫార్ములా ఈ రేసు గురించి అందరికి తెలిసేలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. రేసు వల్ల కలిగిన ప్రయోజనాలు, దాని కోసం పోటీ పడిన దేశాలు, రాష్ట్రాలు, చరిత్ర, అప్పుడేం జరిగింది? ప్రభుత్వం కావాలని రాజకీయంగా ఏ విధంగా ఇరుకున పెడుతున్నది? అనే అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. దీని కోసం శుక్రవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. దీనికి అవసరమైన సమాచారాన్ని, పిటిషన్ ను సిద్దం చేసినట్లుగా తెలిసింది. ఒక వేళ అరెస్ట్ చేసినా, క్వాష్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులతో వాదనలు వినిపించాలనే ఆలోచన చేసినట్లుగా సమాచారం. న్యాయపరంగా ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో బీఆర్ఎస్ లీగల్ టీం సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News