TG Assembly: రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ లేదు.. మిమ్మల్ని ఐదేళ్లు భరించాల్సిందే: కేటీఆర్ హాట్ కామెంట్స్
రాజ్యంగంలో రీకాల్ వ్యవస్థ లేదని.. అందుకే ఈ ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యంగంలో రీకాల్ వ్యవస్థ లేదని.. అందుకే ఈ ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంత ఉంటే.. బడ్జెట్‌లో నిధులు గోరంత ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఒకటో తేదీన ఎందుకు జీతాలు ఇవ్వలేదని ప్రశ్నించగా.. కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినా పథకాలను ఏనాడు ఆపలేదని అన్నారు. ఆ సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైన మాట వాస్తవమని అన్నారు.
తమ పాలనలో అప్పులు, రెవెన్యూ బిల్లలకు లోబడి ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన నికర అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. అప్పుల గురించి మాట్లాడే ప్రభుత్వం.. తాము సృష్టించిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని అన్నారు. జీఎస్‌డీపీలో తెలంగాణ రాష్ట్ర మెరుగైన స్థానంలో ఉందని, రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.14.65 లక్షల కోట్లకు ఆదాయాన్ని పెంచామని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని కేటీఆర్ అన్నారు. ఆరునూరైనా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారని.. మాట తప్పినందుకు మిమ్మల్ని అభినందించాలా అని సెటైర్లు వెశారు. రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ లేదని.. మరో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని కేటీఆర్ అన్నారు.