BREAKING: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. భద్రాచలంలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించింపోయింది. గ్రామాల్లోని వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. తాజాగా, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని గుమ్మడివల్లి సమీపంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్ట్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అక్కడి గోదావరి నీటి మట్టం 46.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమైన లోతట్టు ప్రాంతాల వారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ సూచించారు. మత్స్యకారులు ఎవరూ గోదవరి దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదని హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా గోదవరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు.