BREAKING: ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచెత్తిన వరదలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి.

Update: 2024-09-02 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి. ఈ క్రమంలో వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో చెరువులు కుంటలు తెగి పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుకుపై నుంచి వచ్చే నీటి తీవ్రతతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్-ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతాల్లోకి మున్నేరు వరద పోటెత్తింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండేవారు ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ తరుణంలోనే ఖమ్మం ముంపు ప్రాంతాల్లో ఇవాళ మంత్రి పొంగులేటి పర్యటించారు.

వరద ఉధృతితో తీవ్రంగా నష్టపోయిన బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అదేవిధంగా వరద సహాయక చర్యలు ఏవిధంగా కొనసాగుతున్నాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కనివినీ ఎరుగని నష్టం జరిగిందని తెలిపారు. కేవలం కట్టుబట్టలతోనే చాలామంది రోడ్లపైకి వచ్చేశారని తెలిపారు. వారికి వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. తక్షణమే వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలిచ్చామని అన్నారు. ప్రత్యేకంగా తన నియోజకవర్గమైన పాలేరులో ఎక్కువ డ్యామేజ్ జరిగిందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను పరిశీలించానని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తే బాగుంటుందో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.


Similar News