BREAKING: టీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఝలక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు.. బీఫాం సిద్ధమంటూ క్యాండిడేట్లకు ఫోన్లు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీ కార్యాలయాలు నాయకులు, కార్యకర్తలతో సందడిగా కనిపిస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీ కార్యాలయాలు నాయకులు, కార్యకర్తలతో సందడిగా కనిపిస్తున్నాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కార్యలయం గాంధీభవన్ నిత్య కళ్యాణం.. పచ్చతోరణంలా కలకలలాడుతోంది. ఇదే అదను అనుకున్నారో ఏమో.. గాంధీభవన్ సిబ్బంది, ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఓ ఝలక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం, పార్టీ అభ్యర్థుల వివరాలు వెంటనే ఇవ్వడంటూ ఇవాళ గాంధీభవన్ సిబ్బందికి కొందరు ఆగంతకులు ఫోన్ చేశారు.
అసలే.. ఎన్నికల టైం.. ఏం పని పడిందో ఏమో అని ఏ మాత్రం ఆలోచించకుండా, వాళ్లే నిజంగా ఫోన్ చేశారనుకుని సిబ్బంది అనుకున్నారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఆగంతకులకు పంపారు. ఆ డేటాతో సైబర్ నేరగాళ్లు ఏకంగా ఎంపీ అభ్యర్థులకు టచ్‌లోకి వెళ్లారు. మీ బీ ఫాం సిద్ధమైంది.. రూ.99 వేలు ఫోన్ పే చేయాలంటూ అభ్యర్థులకు ఫోన్లు చేశారు. అవాక్కైన అభ్యర్థులు వెంటనే గాంధీభవన్‌కు సమాచారం అందజేయగా అసలు విషయం బయటపడింది. దీంతో సైబర్ నేరగాళ్లు వేసిన ప్లాన్ కాస్త బోల్తా కొట్టింది.