BREAKING: రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు: మంత్రి తుమ్మల సెన్సేషనల్ కామెంట్స్

రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-06 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సచివాలయంలో రైతు రుణమాఫీ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు వరుసగా నాలుగేళ్లు రూ.25 వేల చొప్పున మాత్రమే రైతు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. కానీ, ఆ రుణ మాఫీతో ఎలాంటి ప్రయోజనం కలుగలేదనే భావన రైతుల్లో పాతుకుపోయిందని అన్నారు. హైదారబాద్ సీటీ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్‌ను తమకు అనుకూలంగా ఉన్న సంస్థకు కేవలం రూ.7 వేల కోట్లకు అప్పనంగా కట్టబెట్టారని, వచ్చిన డబ్బుతో ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా రైతుల ఖాతాలో రూ.లక్షను రుణమాఫీ కింద జమ చేశారని ఆరోపించారు. అందులో రూ.1,400 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలను వెరిఫై చేస్తున్న క్రమంలో సరిగ్గా లేవని ఆ మొత్తాన్ని బ్యాంకులు తిరిగి ప్రభుత్వానికే పంపాయని పేర్కొన్నారు. ఇక మిగిలిన రైతులకు నిన్న, మొన్నటి వరకు వరకు రుణమాఫీ కాలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రుణమాఫీ సరైన పద్ధతిలో చేయకపోయినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, వరంగల్ డిక్లరేషన్లలో ప్రకటించిన విధంగా రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను పకడ్బందీగా మాఫీ చేస్తున్నామని అన్నారు. సాంకేతిక ఇబ్బందులతోనే 30 వేల మంది ఖాతాల్లో డబ్బు జమ కాలేదని, పొరపాట్లను సరి చేసి అర్హులందరకీ రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Tags:    

Similar News