BREAKING: మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్‌ షాక్.. రిట్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కుఎదురైంది.

Update: 2024-07-01 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న ఏజీ వాదనలను సమర్ధించింది. అదేవిధంగా ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తుందంటూ కేసీఆర్ తరఫు న్యాయవాది సీనియర్ అడ్వొకేట్ ఆదిత్య సోంధీ తన వాదనలు వినిపించగా.. ఆయన వాదనలను కోర్టు విభేదించింది. ఈ క్రమంలో కమిషన్‌ను రద్దు చేయాలంటూ గులాబీ బాస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ జూలకంటి అనిల్ ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

కాగా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఎంక్వయిరీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కమిషన్ స్టడీ చేస్తుంది. విద్యుత్ శాఖలోని పలువురు అధికారులకు, రిటైర్ అయిన ఆఫీసర్లకు నోటీసులను జారీ చేసింది. ఆనాడు సీఎంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు సైతం ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేశారు. చివరగా జూన్ 27 కమిషన్ ఎదుట హారరు కావాలని అందులో స్పష్టం చేశారు. దీంతో కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ విద్యుత్ శాఖ సెక్రెటరీ జీవో ఇవ్వడం ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం చెల్లదని, తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.  


Similar News