ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌ను అరెస్ట్ చేయండి: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కేసీఆర్ చేసిన పనులు ప్రజాస్వామ్యానికే అవమానమని ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కేసీఆర్ చేసిన పనులు ప్రజాస్వామ్యానికే అవమానమని ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ పరిస్థితుల ఉన్నప్పటి కంటే దారుణంగా చేశారని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగ, మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆరోపించారు. బీజేపీ నేతలు, తమ అనుచరులను తట్టిలేపడంతో కేసీఆర్‌కు బీజేపీపై ఉన్న భయం ఇప్పుడు బట్టబయలైందని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో రాధా కిషన్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యాయని అన్నారు.
లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న తన కూతురుని కాపాడుకునేందుకు కేసీఆర్ ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసును క్విడ్ ప్రోకోగా రూపొందించాలని భావిస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమవుతోందని తెలిపారు. కేసీఆర్ అండ్ గ్యాంగ్.. దంపతుల మధ్య వ్యక్తిగత సంభాషణలను కూడా వదిలి పెట్టకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. కేసీఆర్ చట్టానికి ద్రోహం చేయడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాల రాశారని మండిపడ్డారు. నిజానికి, ఎమ్మెల్యే పదవితో సహా రాజ్యాంగబద్ధమైన ఏ పదవికి ఆయన అనర్హుడని, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారందరిని ప్రాసిక్యూట్ చేసి, వారి పదవుల నుంచి ప్రజాప్రతినిధులుగా తొలగించాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వాలను నిషేధించడం పట్ల కూడా ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును అమెరికా నుంచి ఎందుకు తీసుకురాలేదని అన్నారు. అతడిని అరెస్టు చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాల చిట్టా బయటకు వస్తుందని, తక్షణమే కేసీఆర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉందని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు కోరుతూ.. సీబీఐకి లేఖ రాయాలని, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ అనర్హుడంటూ శాసనసభ స్పీకర్ ప్రకటిచాలంటూ బండి సంజయ్ ట్వీట్‌ను రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు.