రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు బ్రేక్

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-02-14 15:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 14వ తేదీ వరకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. బదిలీల కోసం రూపొందించిన నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవంటూ నాన్-స్పౌజ్ టీచర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులుగా ఉన్నట్లయితే అదనపు పాయింట్లను కలుపుతూ ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు సమంజసం కావని ఆ పిటిషన్‌లో నలుగురు టీచర్లు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 స్ఫూర్తికి విరుద్ధంగా నిబంధనలు, అదనపు పాయింట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన జీవో 317 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, జోనల్, మల్టీ జోనల్ విధానాల ప్రకారం ఉపాధ్యాయుల బదిలీకి శ్రీకారం చుట్టింది. బదిలీ కానున్న ఉపాధ్యాయులకు గతంలో పనిచేసిన ఉమ్మడి జిల్లా సర్వీసు విషయంలో ఉత్తర్వులకు, ప్రాక్టికల్ ఇబ్బందులకు మధ్య వివాదం నెలకొన్నది. దీన్ని పరిగణనలోకి తీసుకోవడంపై ప్రభుత్వానికి, టీచర్లకు ఏకాభిప్రాయం కుదరలేదు. తాజాగా బదిలీల కోసం ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఫైనల్ చేసిన నిబంధనల్లో ఒకేచోట రెండేండ్ల పాటు పనిచేసినవారికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

రెండేళ్ల సర్వీసును బదిలీకి కనీస అర్హతగా నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాలకు 317 జీవో ప్రకారం బదిలీ అయినవారికి ఆ అర్హత లేకుండా పోయింది. జీవో 317 వచ్చి కూడా రెండేండ్లు పూర్తికానప్పుడు దాని ప్రకారం బదిలీ అయినవారికి ఆ సర్వీసు, అర్హత ఎలా వస్తుందని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. జీవో 317 ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో భార్య ఒకచోట, భర్త మరో చోటకు వెళ్ళిపోవడంతో వారిని ఒకే చోట పనిచేసేలా వెసులుబాటు కల్పించేందుకు స్పౌజ్ అంశంతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కానీ రెండేండ్ల అనుభవం అనేది వారికి గుదిబండగా మారింది.

ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదన్న కారణంతో ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి జిల్లాలో పనిచేసిన అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో పాటు పీఆర్‌టీయూ, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శులను పిటిషనర్లు ప్రతివాదులుగా పేర్కొన్నారు. ముగ్గురు ప్రభుత్వ అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు నోటీసులు జారీచేసి తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News