రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇరిగేషన్‌ డిపార్ట్ మెంట్‌లో బదిలీలకు బ్రేక్

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల ఎఫెక్టు, భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద తదితర పలు కారణాల రీత్యా

Update: 2024-07-20 15:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల ఎఫెక్టు, భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద తదితర పలు కారణాల రీత్యా రాష్ట్ర సాగునీటిపారుదల శాఖలో సాధారణ బదిలీల ప్రక్రియను నిలిపివేస్తూ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. ఇంజినీర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని బదిలీలతో ఏర్పడే ఇబ్బందిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉండేలా ఇరిగేషన్ డిపార్టుమెంటు ఆలోచిస్తున్నది. ఇంజినీర్-ఇన్-చీఫ్ నుంచి వచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న సెక్రటరీ రాహుల్‌బొజ్జా శనివారం ఈ ఉత్తర్వులను జారీచేశారు.

శాఖాపరంగా ఇంజినీర్ల అవసరాలను, సేవల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఉత్తర్వుల్లో సెక్రటరీ పేర్కొన్నారు. వాటర్ ఇయర్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంటు కొన్ని పనులకు సంబంధించి వర్క్ షెడ్యూలు రూపొందించుకున్నదని, ఆన్-గోయింగ్ ప్రాజెక్టుల పనులకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొన్ని ప్రాజెక్టుల రిపేర్ పనులు, మెయింటెనెన్స్, ఆపరేషన్ తదితర అవసరాలు కూడా ఉన్నాయని, వీటికి ఇబ్బంది కలుగకూడదన్న అంచనాతో ఇరిగేషన్ డిపార్టుమెంటులో అన్ని స్థాయిల్లోని ఇంజినీర్ల సాధారణ బదిలీలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.


Similar News