బ్రేకింగ్: తెలంగాణలో వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి

హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2023-05-19 06:05 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: హ‌న్మకొండ జిల్లా కాజీపేట ప‌ట్టణ కేంద్రంలో వీధి కుక్కలు చోటు(8) అనే బాలుడిని కొరికి చంపేశాయి. ఈ దారుణ సంఘ‌ట‌న కాజీపేట రైల్వే కాల‌నీలో శుక్రవారం ఉద‌యం 7గంట‌ల ప్రాంతంలో జ‌రిగింది. బాలుడి కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. మునిసిప‌ల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ జీడ‌బ్ల్యూఎంసీలోని ప‌లు అభివృద్ధి ప‌నుల ప‌ర్యవేక్షణ‌, ప‌రిశీల‌న‌కు వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, కాజీపేట ప‌ట్టణాల్లో ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన రోజే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి వ‌ల‌స వ‌చ్చిన కుటుంబాలు రైల్వే కాల‌నీలో చెట్ల కిందనే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి.

శుక్రవారం ఉద‌యం చోటు అనే 6 సంవ‌త్సరాల బాలుడు దుకాణానికి వెళ్లి వ‌స్తుండ‌గా వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడిపై ఏడెనిమిది కుక్కులు ఒకేసారిగా దాడి చేయ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బాలుడి ముఖం, త‌ల‌, చేతులు, కాళ్లు, మ‌ర్మంగాల‌పై తీవ్రంగా గాయ‌ప‌రిచారు. కుక్కల దాడిలో బాలుడు అక్కడిక‌క్కడే మృతి చెందాడు. కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించే లోపే కుక్కులు బాలుడి ప్రాణాల‌ను తీసేశాయి. కాజీపేట వీధుల్లో ఉంగ‌రాల‌ను అమ్ముకుంటూ పొట్టపోసుకుందామ‌ని వ‌చ్చిన వల‌స కుటుంబానికి తీర‌ని క‌డుపుకోత‌ను మిగిల్చాయి. ముక్కుప‌చ్చలార‌ని బాలుడు కుక్కల దాడిలో క‌న్నుమూయ‌డం చూసిన ప్రతీ ఒక్కరిని కంట త‌డి పెట్టిస్తున్నాయి.

ప్రభుత్వంపై మండిపాటు..!

బాలుడు చోటు మృత‌దేహాన్ని ఒడిలో పెట్టుకుని అన్నా అంటూ ఓ చిన్నారి రోదిస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అభం శుభం తెలియ‌ని బాలుడు కుక్కల దాడికి బ‌లి కావ‌డంపై స‌ర్వత్రా నిర‌స‌న‌, ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలో దృశ్యాల‌ను చూసిన ప్రతీ ఒక్కరి హృద‌యం క‌దిలిపోతోంది. అయ్యో..! ఎంత ఘోరం జ‌రిగిందంటూ బాధ‌ను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ‌లో వ‌రుస‌గా కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ప‌ట్టించుకోదా..? అంటూ జ‌నాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కుల దాడిలో నిత్యం ప‌దుల సంఖ్యలో ప్రజ‌లు గాయాల‌పాల‌వుతున్నా ప్రభుత్వం నిద్రపోతూనే ఉందంటూ నెటిజ‌న్లు ఘాటైన విమ‌ర్శలు చేస్తున్నారు.

రూ.ల‌క్ష ఎక్స్ గ్రేషియా

కుక్క‌ల దాడిలో మ‌ర‌ణించిన చోటు కుటుంబానికి వ‌రంగ‌ల్ జీడ‌బ్ల్యూఎంసీ త‌రుపున రూ.ల‌క్ష ఎక్స్‌గ్రేషియా మేయ‌ర్ గుండు సుధారాణి ప్ర‌క‌టించారు. పోస్టుమార్టం నిమిత్తం చోటు మృత‌దేహాన్ని వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లించారు. అనంత‌రం బాధిత కుటుంబ స‌భ్యుల‌ను యూపీలోని స్వ‌గ్రామానికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు.

Read More:    హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్

Tags:    

Similar News