ప్రజాసేవ మునుగులో అక్రమాలు.. బట్టబయలైన బొంతు శ్రీదేవి భూ దాహం!
అధికారం అండతో కబ్జాలకు పాల్పడ్డారు. ప్రజాసేవ ముసుగులో సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే వాలిపోయారు.
అధికారం అండతో కబ్జాలకు పాల్పడ్డారు. ప్రజాసేవ ముసుగులో సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే వాలిపోయారు. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి భూ దాహం. ఆమెపై వందలాది ఫిర్యాదులు రాగా, ఐదు కేసులు నమోదయ్యాయి. అందులోనూ నాలుగు కేసులు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లోనే. దీనిని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులన్నీంటిలోనూ ఆమె ఏ6గా ఉండటం గమనార్హం. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆమెను పోలీసులు ఏ6గా నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దిశ, సిటీ బ్యూరో: బొంతు రామ్మోహన్ 2016 నుంచి 2020 వరకు గ్రేటర్ హైదరాబాద్‌కు మేయర్‌గా కొనసాగారు. ఆ సమయంలో ఆమె సతీమణి శ్రీదేవి చెర్లపల్లితో పాటు మహానగరంలో ఎక్కడ ఖాళీ జాగా కన్పించిన కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. భూ యజమానులు ఫిర్యాదులు చేస్తే దాడులకు కూడా పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. వందలాది మంది.. వారిపై ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీంతో మూడో కమిషనరేట్ పరిధిలో బొంతు శ్రీదేవితోపాటు ఇతరులపై ఐదు కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం
2020 డిసెంబర్ 24 తేదీలోపు ఘట్ కేసర్ పీఎస్‌లో భూ కబ్జా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి నాలుగు కేసుల్లో బొంతు శ్రీదేవి ఏ6గా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పెట్టిన మరో కేసుతో మొత్తం ఆమెపై ఐదు కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారమిచ్చినట్టు తెలిసింది. తనపై ఎలాంటి కేసుల్లేవంటూ అఫిడవిట్ దాఖలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చెర్లపల్లి నుంచి అధికార పార్టీ కార్పొరేటర్‌గా కొనసాగుతున్న ఆమెపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
పీఎస్‌లలో కేసులు
సర్వే నెంబర్ 89/1,89/1/6లోని స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఏ వెంకటేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో బొంతు శ్రీదేవిని 6వ నిందితురాలుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నెం.547/2020 నమోదు చేశారు. యమ్నంపేట విలేజ్‌లోని సర్వే నంబర్ 155 నుంచి 162లో భూ కబ్జాకు పాల్పడ్డారంటూ అఫ్సర్ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అందులోనూ బొంతు శ్రీదేవి ఏ6. అదే గ్రామంలో సర్వే నెంబర్లు 159, 160, 161లో భూమిని ఆక్రమించారంటూ పుష్పక్ రెడ్డి ఫిర్యాదు చేయటంతో బొంతు శ్రీదేవిని ఏ6గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో కాంపౌండ్ వాల్‌ను బలవంతంగా నేలమట్టం చేసి భూ ఆక్రమణకు పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు. సర్వే నెంబర్ 89, 155 నుంచి 162 వరకున్న భూమి కబ్జాకు యత్నించారని మీసాల మల్లేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో ఘట్ కేసర్ పోలీసులు కబ్జా కేసుతో పాటు అట్రాసిటీ కేసు సైతం నమోదు చేశారు. ఇందులో కూడా బొంతు శ్రీదేవి ఆరో నిందితురాలిగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన 2020 డిసెంబర్ లోనూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బొంతు శ్రీదేవిపై భూ కబ్జా కేసు నమోదైంది.
'ఏ6' అసలు కథ ఇదేనా?
అన్ని కేసుల్లోనూ బొంతు శ్రీదేవి ఏ6గా ఉండడం గమనార్హం. కేసు తీవ్రత తగ్గించేందుకే పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను ఆరో నిందితురాలిగా చేర్చినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా భూ కబ్జా కేసుల్లో నిందితులను పిలిచి విచారించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.