దద్దరిల్లుతున్న గోల్కొండ పరిసర ప్రాంతాలు

హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగే పండుగల్లో బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

Update: 2024-07-07 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగే పండుగల్లో బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆషాడ మాసంలో ఈ భోనాల పండుగలను చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆషాడ మాసం తొలి బోనం గోల్కొండలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించనున్నారు. దాదాపు లక్షకు పైగా పాల్గొననున్న ఈ బోనాల జాతరకు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తొలి బోనం సమర్పించనుండగా..ఇప్పటికే గోల్కొండ పరిసర ప్రాంతాల్లో సందడి మొదలైంది. పొతరాజులు విన్యాసాలు, డోలు సప్పుడు, శివసత్తుల బోనాల ఊరేగింపులతో పాతబస్తి దద్దరిల్లిపోతోంది. ఈ రోజు గోల్కొండకు మొయినాబాద్, చేవెళ్ల, కాళీ మందిర్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తొలి బోనం అమ్మవారికి అందించనున్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి తమ బోనాలు సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని చూడటం కోసం పెద్ద ఎత్తున సందర్శకులు భక్తులు తెల్లవారేసరికి గోల్కొండకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారిపోయింది.


Similar News