జోరుగా బ్లాక్ దందా..! దారి మళ్లిన యూరియా?

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రబీ సీజన్లో అలాట్మెంట్ యూరియా పక్క దారి పట్టింది.

Update: 2023-02-28 01:37 GMT

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రబీ సీజన్లో అలాట్మెంట్ యూరియా పక్క దారి పట్టింది. నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీకి చెందిన యూరియా ఈ నెలలో బుధవారం జిల్లాకు 450 మెట్రిక్ టన్నుల యూరియా అలాట్మెంట్ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎరువుల దుకాణాలలో యూరియా నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి ? ఎవరెవరికి విక్రయించారనే విషయంపై కాటారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తనిఖీ చేశారు.

సోమవారం కాటారం వ్యవసాయ అధికారి రామకృష్ణ దుకాణాలలో మరొకసారి స్టాక్‌లను పరిశీలించి నాలుగు ఎరువుల దుకాణాలలో 2,122 బస్తాల యూరియా అమ్మకాలు చేయకుండా నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. కాటారం మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన రాజరాజేశ్వర ఫర్టిలైజర్స్‌కు 39.60 టన్నులు, క్రాంతి కుమార్ ఫర్టిలైజర్స్‌కు 99 టన్నులు, బచ్చు ప్రభాకర్ ఫర్టిలైజర్స్‌కు 39.6 టన్నులు, లావణ్య ఫర్టిలైజర్స్‌కు 19.8 టన్నుల యూరియాను దుకాణదారులు దిగుమతి చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఈ నిల్వలు ఉన్నాయి.

యూరియాను కొందరు దుకాణదారులు హోల్‌సేల్‌గా కొంత విక్రయించారు. మహాదేవపూర్, మలహర్, మండలాల ఎరువుల దుకాణాలకు అలాట్మెంట్ ఇచ్చిన మేరకు కాకుండా కొంత స్టాక్ తక్కువగా పంపినట్లు సమాచారం. కాటారం మండలంలోనూ దుకాణాలకు ఇచ్చిన అలాట్మెంట్ వేరు ఇక్కడ క్షేత్రస్థాయిలో దుకాణాలలో యూరియా ఉన్న నిల్వలు వేరని తెలుస్తోంది. రైతులకు ఇప్పుడు అవసరం ఉన్న యూరియా ఎరువును వ్యవసాయ అధికారులు తనిఖీలు చేసి విక్రయించకుండా నిలుపుదల నోటీసు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలలోనూ ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ అక్కడ తనిఖీలు జరగలేదు.

యూరియా అమ్మకాలు జరగకుండా నిలిపివేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎరువుల దుకాణాల పేరు మీద కంపెనీ ప్రతినిధులు అలాట్మెంట్ చేసి ఇతర ప్రాంతాలకు విక్రయించినట్లు సమాచారం. నాగార్జున కంపెనీ జిల్లాకు ఇచ్చిన అలాట్మెంట్ ఎరువుల దుకాణాల వారీగా యూరియా కేటాయింపు వివరాలు వెళ్లడైతే యూరియా కేటాయింపులు అమ్మకాలలో ఏం జరిగింది అనే గుట్టు రట్టవుతుంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్‌ను కోరగా కంపెనీ నుండి అలాట్మెంట్ వివరాలు రాగానే ఇస్తామన్నారు.

Tags:    

Similar News