నేడు చేవెళ్లలో అమిత్ షా- రేపు ఔరంగాబాద్‌లో KCR సభ.. ఇద్దరి ప్రసంగాలపై ఉత్కంఠ!

రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ ముదురుతున్నది. అధికారిక కార్యక్రమం నిమిత్తం ఇటీవల నగరానికి వచ్చిన ప్రధాని మోడీ అవినీతి ప్రభుత్వమంటూ బీఆర్ఎస్ పార్టీని, కుటుంబ పాలన అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు.

Update: 2023-04-23 02:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ ముదురుతున్నది. అధికారిక కార్యక్రమం నిమిత్తం ఇటీవల నగరానికి వచ్చిన ప్రధాని మోడీ అవినీతి ప్రభుత్వమంటూ బీఆర్ఎస్ పార్టీని, కుటుంబ పాలన అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ తర్వాత అంబేడ్కర్ జయంతి రోజున ముఖ్యమంత్రి ఘాటుగానే కౌంటర్ ఇస్తారని భావించినప్పటికీ ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం రాష్ట్రానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసే ప్రసంగంలో ఎలాంటి విమర్శలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. వాటికి ఆ తర్వాతి రోజున ఔరంగాబాద్‌లో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఫైర్ అవుతారనేదానిపై చర్చలు మొదలయ్యాయి. ఈ రెండూ పొలిటికల్ మీటింగులే కావడంతో ఇరు పార్టీల నేతలు పరస్పరం రాజకీయ విమర్శలకు దిగుతారని అంతా భావిస్తున్నారు.

విమర్శలు.. ఆరోపణలు..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా ప్రజల్లో మైలేజీ పెంచుకోడానికి పోటీ పడుతున్నాయి. ఒకదానిపై మరొకటి ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు బీజేపీ అగ్రనేతలు చాలామంది ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవినీతిపరుడిగా, కమీషన్ల రూపంలో ప్రజాధనాన్ని పోగేసుకుంటున్నట్లుగా ఆరోపణలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఒక ఏటీఎంలాగా మారిందన్నారు. ఇటీవల ప్రధాని వాటికి బలం చేకూర్చే విధంగా అవినీతి ప్రభుత్వమంటూ విమర్శించారు.

అమిత్ షా స్పీచ్ పై ఉత్కంఠ..

పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు అమిత్ షా ఈ నెల 23న రాష్ట్రానికి వస్తున్నారు. స్టేట్ లీడర్లతో వివిధ అంశాలపై మాట్లాడిన తర్వాత చేవెళ్లలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. సభను ఎలక్షన్ మీటింగ్‌గానే జరపాలనుకుంటున్నది బీజేపీ. రాష్ట్ర, స్థానిక నాయకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా చేసే ప్రసంగం పార్టీకి రాష్ట్రంలో జోష్ తీసుకొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్‌పైనా, కేసీఆర్‌పైనా చేసే విమర్శలు బీజేపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతాయన్న ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, పదోతరగతి హిందీ పేపర్ లీక్ కేసులో సంజయ్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేయడం తదితరాలన్నింటినీ ప్రస్తావించే అవకాశమున్నది. రాష్ట్ర అధికార పార్టీ నేతలను తీవ్ర స్థాయిలో హెచ్చరించవచ్చనే చర్చ కాషాయ నేతల్లో సాగుతోంది.

మహారాష్ట్ర పాలిటిక్స్ పై కేసీఆర్ ఫోకస్...

బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలో బహిరంగ సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని విమర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు బహిరంగసభలను నిర్వహించిన కేసీఆర్ ఈ నెల 24న మూడో సభకు హాజరవుతున్నారు. అమిత్ షా చేవెళ్ల సభ జరిగిన మరుసటి రోజునే ఇది జరుగుతుండడంతో ఆయన విమర్శలకు అక్కడ ఘాటుగానే స్పందించే అవకాశమున్నదని గులాబీ నేతలు సూచనప్రాయంగా తెలిపారు. రెచ్చగొట్టే తీరులో అమిత్ షా మాట్లాడితే దానికి కౌంటర్‌గా ఔరంగాబాద్ సభ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

రెండు పార్టీల డైలాగ్ వార్..

ర్రాష్ట్రంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఒకదాన్ని మించి మరొకటి దూషించుకుంటున్నాయి. పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. తెలంగాణ పట్ల వివక్షకు పాల్పడుతున్నట్లు విమర్శిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉసిగొల్పుతున్నదంటూ తూర్పారపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నదని ఆరోపిస్తున్నారు. బీజేపీ శ్రేణులను ఆందోళనలోకి నెట్టడానికి బండి సంజయ్ లాంటి నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేయడం, ఇతర నేతలను గృహనిర్బంధం చేసి అడ్డుకుంటున్నదనే ఆరోపణలూ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పరస్పర విమర్శలు రానున్న కాలంలో ఏ రూపం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News