T- బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రంలో మరో కీలక కార్యక్రమం!
వీధి సభలతో తలమునకలైన కాషాయదళం తన నెక్స్ట్ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: వీధి సభలతో తలమునకలైన కాషాయదళం తన నెక్స్ట్ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుంది. బూత్ స్వశక్తికరణ్ పేరిట మరో డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పార్టీని బూత్ స్థాయికి చేర్చేందుకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఉపయోగపడనుంది. కాగా బూత్ స్వశక్తికరణ్‌తో పోలింగ్ బూత్‌ల్లో బలోపేతంపై బీజేపీ దృష్టిసారించనుంది.
పోలింగ్ బూత్ ఇన్ చార్జీల నియామకం కమలం పార్టీకి పెద్ద టాస్క్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా బూత్ స్వశక్తికరణ్ పేరిట దీన్ని సులువుగా పూర్తిచేయడంపై కాషాయ పార్టీ కసరత్తులు చేయనుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌తో పార్టీని ప్రతి ఇంటికీ చేర్చడంపై నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పూర్తయితే బూత్ స్వశక్తికరణ్ ద్వారా పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలు వేసి భవిష్యతలో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవడంపై నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది.
బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, సరళ్ యాప్‌పై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా దృష్టిసారిస్తోంది. ఇప్పటి వరకు కమిటీల ఏర్పాటు ఎంతమేర వర్కవుట్ అయింది, ఎన్ని వీధి సభలు నిర్వహించారు, సరళ్ యాప్‌లో భాగంగా ఎంతమంది పేర్లను అప్ డేట్ చేశారనే అంశాలపై హైకమాండ్ ఆరా తీయనుంది.
అందులో భాగంగా రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ సహ ఇన్ చార్జి అర్వింద్ మీనన్ రానున్నారు. రాష్ట్ర పదాధికారులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జీలతో భేటీ కానున్నారు. ఈ నెల 23వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. అన్ని అంశాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఈ మీటింగ్ సాగనుంది. హైకమాండ్ అనుకున్న వ్యూహాలను పూర్తిస్థాయిగా ఇంప్లిమెంట్ చేయడంపై వారు దిశానిర్దేశం చేయనున్నారు.
పోలింగ్ బూత్‌ల్లో నేతలు చేయాల్సిన పని, సరళ్ యాప్ అప్ డేట్ వంటి అంశాలపై కమల దళం రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. నలుగురేసి సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. బూత్ కమిటీల నియామకం బిగ్ టాస్క్‌గా మారడంతో సమన్వయం చేసుకునేందుకు వీరిని నియమించారు. తెలంగాణలో 35 వేల బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని జాతీయ నాయకత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. కానీ ఇప్పటివరకు 10వేల బూత్ కమిటీలు మాత్రమే పూర్తయినట్లు సమాచారం.
ఒక్కో బూత్ కమిటీలో 22 మందితో కూడిన సభ్యులు ఉండాలనేది నిబంధన. బూత్ కమిటీలను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వంపై జాతీయ నాయకత్వం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బూత్ స్వశక్తికరణ్‌పై కాషాయ పార్టీ దృష్టి పెడుతోంది. కాగా పలు ప్రాంతాల్లో ఇది పూర్తిస్థాయిలో పూర్తికాకపోవడంతోనే నేతలు ఈ అంశంపై కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. కమిటీల ఏర్పాటులో ఎదురవుతున్న చిక్కులను అధిగమించేందుకు ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చ సాగనుంది.