బిగ్ న్యూస్: ఎమ్మెల్సీ కవిత దీక్షకు కౌంటర్‌గా BJP మరో ప్లాన్.. ఉత్కంఠ పెంచుతోన్న పోటాపోటీ నిర్ణయాలు!

Update: 2023-03-09 12:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీ దీక్షలకు సిద్ధం అయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు నిరసనగా బీజేపీ కౌంటర్ దీక్ష చేపట్టబోతోంది. రేపు హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు ఢిల్లీలో బీజేపీ నేతలు నిరసన దీక్షకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాంపల్లి కార్యాలయంలో జరగబోయే దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా మహిళ గోస-బీజేపీ భరోసా పేరుతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు.

మరోవైపు ఢిల్లీ బీజేపీ యూనిట్ సైతం రేపు దీక్ష చేపట్టబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టాలని మొదట భావించారు. అయితే ఒకే రోజు ఇటు కవిత అటు బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాల కోసం దరఖాస్తులు రాగా స్థలం విషయంలో తర్జన భర్జన కొనసాగింది. దీక్ష స్థలాన్ని చెరికొంత భాగం పంచుకోవాలనే ప్రతిపాదన తీసుకురాగా బీజేపీ నేతలు అందుకు అంగీకరించి జంతర్ మంతర్ నుంచి ధర్నా వేదికను దీన్ దయాల్ మార్గ్‌కు మార్చుకున్నారు.

కవిత దీక్షకు రూట్ క్లియర్:

రేపటి భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టబోయే దీక్షకు లైన్ క్లియర్ అయింది. జంతర్ మంతర్‌లోనే యథావిధిగా కవిత నిరాహార దీక్ష కొనసాగనుంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష కోసం జాగృతి నేతలతో పాటు ఢిల్లీ బీజేపీ నేతలు అప్లై చేసుకోవడంతో స్థలం విషయంలో ఇరు వర్గాలు కుదించుకోవాలని పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే తమకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని అందువల్ల తమకే కేటాయించాలని జాగృతి నేతలు చెప్పడంతో బీజేపీ నేతలు తమ దీక్ష స్థలాన్ని వేదికను మార్చుకున్నారు. దీంతో కవిత నిరసన కార్యక్రమానికి లైన్ క్లియర్ అయింది.

Tags:    

Similar News