మీడియా సంస్థలపై బెదిరింపులకు దిగుతున్న బీజేపీ: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులనే కాకుండా మీడియా సంస్థలపై కూడా బీజేపీ నిర్ధాక్షిన్యంగా బెదిరింపులకు పాల్పడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులనే కాకుండా మీడియా సంస్థలపై కూడా బీజేపీ నిర్ధాక్షిన్యంగా బెదిరింపులకు పాల్పడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో విపక్ష ఎంపీలు మాట్లాడితే ఎలాంటి కారాణాలు లేకుండానే సస్పెండ్ చేశారని తెలిపారు. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎలాంటి ఆధారాలు లేకుండా చార్జ్‌షీట్ ఫైల్ చేయకుండానే జైలు పెట్టారని ఆరోపించారు. ఒక సీఎంకే ఆ పరిస్థితి వస్తే.. సామాన్యు పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసిన వాళ్లపై.. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తూ లొంగిదీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
సాక్షాత్త సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వివరించారని గుర్తు చేశారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, వాక్ స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగు చట్టాలు తెచ్చారని విమర్శించారు. పదేళ్లలో ఏం చేశారో మోడీ చెప్పడం లేదని, మళ్లీ గెలిస్తే.. ఏం చేస్తారో చెప్పడం లేదని ఉత్తమ్ అన్నారు.
Read More: నెల రోజుల్లో ఆ పని పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటా: మంత్రి కోమటిరెడ్డి కీలక హామీ