బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టాలి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లాలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్ల బాణాసంచా నిప్పు రవ్వలు ఇంటిపై పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ ఆనందం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని బీఆర్ఎస్ నేతలను సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి డిమాండ్ చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలని, తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు కారణంగా ఒకరు చనిపోవడంతోపాటు పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుండటం సహించరాని నేరంగా బండి పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకలో విచ్చలవిడిగా కల్తీ కల్లు రాజ్యమేలుతుంటే ఏం చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని పట్టుబట్టారు. కల్తీ కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.