‘సుఖేష్ లేఖతో కేసీఆర్-కేజ్రీవాల్ బంధం బయటపడింది’
సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్య బంధం బయటపడిందని, ఈ బంధం లిక్కర్ స్కామ్ దేనని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్య బంధం బయటపడిందని, ఈ బంధం లిక్కర్ స్కామ్ దేనని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ రాష్ట్రం దాటి దేశానికి విస్తరించిందని ఆయన ఆరోపణలు చేశారు. సుఖేశ్ మారిన సూట్ కేసుల సంగతి కూడా పూసగుచ్చినట్లు వివరించాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కార్యాలయానికి పెద్ద పెద్ద సూట్ కేసులు ఎలా వెళ్లాయని చుగ్ ప్రశ్నించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌పై విచారణ జరుగుతోందని, ఈ అంశంపైనా విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు.
కేసీఆర్ సర్కార్ మునిగి పోయే నావ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌కు పోయే కాలం దగ్గరపడిందని ఆయన విమర్శలు చేశారు. ప్రజలు ఆక్రోశంతో ఉన్నారని, కుటుంబ పాలనను తరిమికొట్టేందుకు వారంతా సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కు.. ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని ఆయన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపైనా చుగ్ క్లారిటీ ఇచ్చారు. సంస్థాగత ఎన్నికల తరవాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని చుగ్ కుండబద్ధలు కొట్టారు. సంజయ్ ఆధ్వర్యంలోనే సంస్థాగత ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. అప్పటి వరకు బండినే కొనసాగించనున్నట్లు స్పష్టంచేశారు.