కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పేపర్ లీక్ కేసు సీబీఐకి అప్పగించాలి: RSP డిమాండ్

Update: 2023-03-18 11:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో సిట్ దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం లేదని.. అందువల్ల సీబీఐ చేత విచారణ చేయించేలా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు. శనివారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన సీబీఐ ఎంక్వయిరీతో పాటు చైర్మన్ పదవి నుంచి బి.జనార్దన్ రెడ్డిని వెంటనే తొలగించాలని వినతిపత్రం అందజేశారు. జనార్ధన్ రెడ్డి ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు సంబంధించిన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

మరో వైపు ట్విట్టర్‌లో స్పందించిన ఆర్ఎస్పీ.. సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన 15 ఎగ్జామ్స్ పేపర్లు లీక్ అయినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన షేర్ చేశారు. టీఎస్‌పీఎస్సీపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదంటూ టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ట్వీట్‌కు ఆర్ఎస్పీ రియాక్ట్ అయ్యారు.

ఘంటా చక్రపాణి అమాయకంగా మాట్లాడుతున్నారని, కొంచెం ఆలోచన చేయాలని అన్నారు. టీఎస్‌పీఎస్సీ నియామక మండలిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వమే కదా అన్నారు. టీచర్లను, రిపోర్టర్లను, బీఆర్ఎస్ భజన బ్యాచ్‌ను ఈ మండలిలో సభ్యులుగా తీసుకున్నది ఎవరు అని నిలదీశారు. బోర్డు మండలిలో చాలా మందికి ఉన్న అర్హతలేంటో చెప్పాలన్నారు. బోర్డు చైర్మన్‌గా మీరు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ నామినేట్ చేసిన ఓ సభ్యుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా పత్రాల లీకేజీ కేసులో జైలుకు పోయిన విషయం మీకు తెలియనిదా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News