BJP: ‘మోర్చా’ల ప్రోగ్రామ్స్‌పై ఆంక్షలు..! అనుమతి తప్పనిసరంటున్న అధినాయకత్వం
పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచిన బీజేపీ దూకుడు మీదున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచిన బీజేపీ దూకుడు మీదున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై బీజేవైఎం, గిరిజన, మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల రుణమాఫీపై కిసాన్ మోర్చా సైతం నిరసనలు తెలిపింది. అయితే ఇలా కార్యక్రమాలు చేసే వారిపై కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆంక్షలు విధించినట్లు తెలిసింది. ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే ముందుగా స్టేట్ యూనిట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని షరతులు పెట్టినట్లు సమాచారం. దీంతో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇలా అయితే ప్రజా క్షేత్రంలోకి ఎలా వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలతో సైలెంట్
బీజేపీలో ఎస్సీ, బీసీ, గిరిజన, మైనారిటీ, కిసాన్, మహిళా మోర్చా, బీజైవైఎం మొత్తం ఏడు మోర్చాలు ఉన్నాయి. అందులో యాక్టివ్ గా ఉన్నది బీజేవైఎం, మహిళా మోర్చాలు మాత్రమే. మిగతా మోర్చాలు అడపాదడపా మినహా పెద్దగా కార్యక్రమాలు చేపట్టవు. గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, జాబ్ క్యాలెండర్, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు ఆందోళనకు దిగారు. యువతులు, మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అఘాయిత్యాలపై మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళనలు చేశారు. అయితే ఇప్పుడు ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా.. ఆంక్షలు విధించడంతో చేసేదేం లేక వారు కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారని సమాచారం.
పెదవి విరుస్తున్న శ్రేణులు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల కారణంగా ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆయనకు జమ్మూ, కశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జి బాధ్యతలు సైతం అప్పగించడంతో పార్లమెంట్ సెషన్స్ అనంతరం అక్కడికే వెళ్తున్నారు. అటు కేంద్ర మంత్రిగానూ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పథకాల అమలులో జాప్యంపై, ఇతర అంశాలపై ఇరుకున పెట్టేందుకు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, ఆంక్షలు విధించడంపై శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. ఇలా అయితే ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నాయి.