BJP: తమ్ముడిగా అక్కకు అండగా ఉంటా.. మంత్రి కొండా సురేఖకు రఘునందన్ రావు భరోసా

ఒక తమ్ముడిగా కొండా సురేఖ అక్కకు అండగా ఉంటానని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తానని, బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Update: 2024-10-01 12:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక తమ్ముడిగా కొండా సురేఖ అక్కకు అండగా ఉంటానని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తానని, బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కొండా సురేఖపై పెట్టిన పోస్టులపై స్పందించిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేశారని. అక్కకి, చెల్లికి, తల్లికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించలేని సంస్కార హీన స్థితిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మెదక్ ఇంచార్జి మంత్రి హోదాలో తొలిసారి వారు దుబ్బాకకు వచ్చారని, దుబ్బాకలో ఉన్న చేనేత కార్మికుల కష్టాలను తెలిపేందుకు మంత్రి కొండా సురేఖకు అక్క దండ వేయోచ్చా? అని అడిగి, ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డగా నేతన్నల సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి, ఒక అక్కకు తమ్ముడిగా ఆమె మెడలో నూలు పోగుల దండ వేస్తే సంస్కార హీనంగా పోస్టులు పెట్టడం బాధకరమని అన్నారు.

దిగజారుడు రాజకీయాలు తగదు!

ఓ తమ్ముడిగా వారికి జరిగిన ఇబ్బందికి విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అక్కకు జరిగిన అన్యాయానికి ఒక తమ్ముడిగా అండగా ఉంటానని, ఒక వకీలుగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తానని స్పష్టం చేశారు. ఈ పోస్ట్ పెట్టిన వారు కేసీఆర్, హరీష్ రావుల ఫోటోలు డీపీలుగా పెట్టుకున్నారని, కింద కామెంట్లు చేసిన వారు కూడా ఎక్కవ మంది హరీష్ రావు డీపీలు పెట్టుకున్నవారేనని తెలిపారు. నిజంగా హరీష్ రావుకు చిత్తశుద్ది ఉంటే.. ఇందులో మీ ప్రమేయం లేకపోతే ఇది చేసిన వారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని, లేకపోతే నా ఫోటో వాడుకొని దుష్ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ చేయాలని అన్నారు. ఈ ట్విట్టర్ అకౌంట్లను వాడుకొని ఇతర పార్టీలపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని, చాలా సంవత్సరాలు మంత్రిగా పని చేసిన మీరు దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన పై హరీష్ రావు చింతిస్తున్నాను అని చెప్పి చేతులు దులుపుకోవడం ఏంటని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొండి

వారితో మీకేమైనా సిద్ధాంత పరమైన విభేదాలు ఉంటే కొట్లడాలి. కానీ ఆడవారిపై ఇటువంటి పోస్టులు ఏంటని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేయాలని, లేదంటే వీరు చెలరేగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. వెకిలి చేష్టలు చేస్తే.. మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొవాలని, అమ్మకి ఆలీకి తేడా తెలుసుకొని పోస్టులు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బీసీ మంత్రిని ఇంత దారుణంగా అవమించడం సంస్కరమేనా? అని, బీఆర్ఎస్ వాళ్లకి మహిళలు అంటే కవిత తప్ప ఇంకెవరు కనిపించరా అని ప్రశ్నించారు. దేవుడు మహిళల్లో ఒక్క తల్లిని చెల్లినీ చూసుకొనే సంస్కారం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. సిరిసిల్లలో నేతన్నలు ఎక్కువగా ఉంటారని, బీఆర్ఎస్ నేతన్నలకు చెందిన మహిళని అవమానించిందని, కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడు నేతన్నలు అడ్డుకోవాలని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. 


Similar News