కేంద్ర వరద సాయంపై తెలంగాణ బీజేపీ ఎంపీల కినుక
గత నెల సంభవించిన వరదలకు జరిగిన నష్టానికి పరిహారంగా కేంద్రం నుంచి ఆర్థిక సాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: గత నెల సంభవించిన వరదలకు జరిగిన నష్టానికి పరిహారంగా కేంద్రం నుంచి ఆర్థిక సాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నది. సుమారు రూ.10,320 కోట్ల మేర నష్టం జరిగితే కేవలం రూ.416 కోట్లనే కేంద్రం ప్రకటించింది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు (బీజేపీ) గెలిచినా, వరద బాధిత ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయి పర్యటించినా చివరకు కేంద్రం నుంచి ఏం సాధించారంటూ ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు సంధిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాజకీయంగా బీజేపీని కార్నర్ చేయడానికి ఈ రెండు పార్టీలకు బలమైన అస్త్రం దొరికినట్లయింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ నిధులను ఇచ్చిన కేంద్రం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం తక్కువ ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. సౌత్ ఇండియాకు తెలంగాణను ‘గేట్ వే’గా మార్చుకుంటామని బీజేపీ పదేపదే చెప్తున్నా వరద నష్టానికి అందించే సాయం ఇదేనా? అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దీటైన సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెచ్చిందేంటనే ప్రశ్నలు
వరదల కారణంగా వివిధ రూపాల్లో ఏ మేరకు నష్టం జరిగిందో సమగ్రమైన నివేదికను పంపినా చివరకు ఆశించిన దాంట్లో కేంద్రం నుంచి వస్తున్నది 4% మాత్రమే. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, రైతాంగం పట్ల చిన్నచూపు చూస్తున్నదంటూ రెండు రోజుల పాటు రైతు దీక్ష పేరుతో హడావిడి చేసిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ లేవనెత్తే ఆరోపణలకు సమాధానం చెప్పలేని ఆత్మరక్షణలో పడింది. తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా సొంత రాష్ట్రానికి వరద సాయాన్ని తెచ్చిందేంటనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధుల్లో వేర్వేరు పేర్లతో కోతలు పెట్టి కేటాయింపులను కుదిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. సెస్, సర్‌చార్జీల పేరుతో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా మొత్తం కేంద్రమే వాడుకుంటున్నదని 16వ ఫైనాన్స్ కమిషన్‌కు సైతం ఓపెన్‌గానే వివరించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఏపీకి వెయ్యి కోట్లు.. తెలంగాణకు అందులో సగమైనా ఇవ్వలే
ఒకవైపు వరద సాయంలో రాజకీయాలు ఉండబోవని, మానవతా దృక్పథంతో సాయం చేస్తామని, బాధిత కుటుంబాలు నిలదొక్కుకునేలా సహకారం అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గత నెల 6న సీఎంతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో తెలంగాణపై కూడా అదే ధోరణిని అనుసరించాలని, సాయం అందించే విషయంలో ఆ రాష్ట్రానికి తగినట్లుగానే ఇవ్వాలని సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్టు చేశారు. వరద నష్టం రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తరహాలో భారీగా ఉన్నందున కేంద్రం నుంచి వచ్చే సాయంలోనూ అదే తరహా విధానం ఉండాలని నొక్కిచెప్పారు. కానీ ఆచరణలో మాత్రం ఎన్డీఏ కూటమి సర్కారు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు రూ.వెయ్యి కోట్లకు పైగా కేటాయించి తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో సగం కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఇప్పటికే మొదలయ్యాయి. కేంద్ర మంత్రి, ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో వరద తీవ్రతను పరిశీలించి వెళ్లినా ఆర్థిక సాయం విషయంలో మాత్రం చిన్నచూపు చూడడం విమర్శలకు దారితీసింది.
వరద సాయంపై బీజేపీ ఎమ్మెల్యేలే.. కాంగ్రెస్ టార్గెట్
రానున్న రోజుల్లో బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయడానికి ఈ అంశం దోహదం చేసినట్లయింది. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రస్తావించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలు దీన్ని విస్తృతంగా వినియోగించుకోనున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలనే తాము కోరుకుంటున్నామని, దానికి తగినట్లుగానే వ్యవహరిస్తున్నామని ఇప్పటికే సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాల ఎదుగుదలకు కేంద్రం సహకరించాలని, రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం పాటించాలని సీఎం అప్పీల్ చేశారు. రాష్ట్రాలకు కేంద్రం అందిస్తున్న డివొల్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 42 % నుంచి 50 శాతానికి పెంచాలని, దీన్ని నెరవేర్చితే దేశం భావిస్తున్న ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సంపూర్ణంగా సహకరిస్తామని 16వ ఫైనాన్స్ కమిషన్‌కు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
డిఫెన్సులో కాషాయ పార్టీ ఎంపీలు
వరద సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణ బహిర్గతం కావడంతో ఇకపైన సంబంధాలను కొనసాగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎలాగూ వరద సాయం విషయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సైతం కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కోణం నుంచి నిలదీసే అవకాశమున్నది. బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఇప్పుడు డిఫెన్సులో పడ్డారు. కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్లయితే సవాళ్లను, ప్రతివిమర్శలను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటివరకూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహాలో ఉన్న రాజకీయ పరిస్థితి రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ షేప్ తీసుకునే అవకాశమున్నది.