'కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగలడం ఖాయం'

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని నిన్న ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు.

Update: 2023-08-22 15:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని నిన్న ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అయన బీఆర్‌ఎస్ విడుదల చేసిన ఎమ్మెల్యేల లిస్టుపై స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ గతంలో కేసీఆర్ అన్న వ్యాఖ్యలు చూస్తే.. ఈ సారి పెద్దఎత్తున మార్పులు ఉంటాయని అంతా అనుకుంటే తీరా అభ్యర్థులను చూస్తే 7 చోట్ల మినహా సిట్టింగులందరికి మళ్లీ టికెట్ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్, ఆయన పార్టీ సిగ్గు తప్పిన విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.

దళిత బంధు పథకంలోలంచం తీసుకున్న ఎమ్మెల్యేల సమాచారం ఉందని తెలిపిన కేసీఆర్ తిరిగి వారికే టికెట్లు కట్టబెట్టడమంటే అవినీతిని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పాత సీసాలో పాత సారానే తలపించిందన్నారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు తీసుకొని పని పూర్తయ్యాక వదిలేరని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను ఉద్యమానికి ఉపయోగించుకుని, రాష్ట్రం ఏర్పడ్డాక వారికి ద్రోహం చేశారని ఆరోపించారు. కేసీఆర్ అవకాశవాదం, ద్వంద్వ వైఖరి, వాడుకొని వదిలేసే విధానం గురించి తెలుసుకున్న ప్రజలు తమ ఓటుతో బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలోకి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు సాకారం చేసుకునేందుకు, కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌తో తమ ఆకాంక్షలు నెరవేరుతాయని భావిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ అన్నివిధాలా అండగా ఉండి వారి కలలను సాకారం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసి ప్రజలకు అందించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు.

పతాక స్థాయికి చేరిన కేసీఆర్, ఆయన ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ స్వయంగా పెద్ద అవినీతిపరుడు. అవినీతిలో ఆవిష్కరిస్తున్న కొత్త విధానాలకు ఆస్కార్ అవార్డు ఇచ్చేదుంటే కేసీఆర్ ఈ అవార్డుకు అన్నివిధాల అర్హుడని చెప్పవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చెప్పేదొకటి చేసేదొకటి. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే ఉండడం బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందన్నారు. సొంత పార్టీలో మహిళలకు జరిగిన ఈ దారుణమైన అన్యాయాన్ని కవిత ఎలా సమర్థిస్తారని అయన ప్రశ్నించారు.


Similar News