పరిధికి మించి కేసీఆర్ సర్కార్ అప్పులు: MP లక్ష్మణ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎఫ్ఆర్ బీఎం పరిధికి మించి అప్పులు చేశారని, దీనివల్ల అత్యవసర సమయాల్లో అప్పులు చేసే అవకాశాన్ని కూడా సీఎం కేసీఆర్ కోల్పోయారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు.

Update: 2022-12-26 09:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎఫ్ఆర్ బీఎం పరిధికి మించి అప్పులు చేశారని, దీనివల్ల అత్యవసర సమయాల్లో అప్పులు చేసే అవకాశాన్ని కూడా సీఎం కేసీఆర్ కోల్పోయారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల మాదిరిగా కాకుండా.. పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించిందని తెలిపారు. పార్టీలకతీతంగా సభ్యులందరికీ చర్చించే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణలో పథకాల పేర్లు, నిధుల దుర్వినియోగంపై సభలో ప్రస్తావించినట్లు లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస్ యోజన నిధులు డైవర్ట్ చేసిందని ఆరోపణలు చేశారు. డిస్కంలకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా అప్పుల ఊబిలో నెట్టేయడంపై సభలో ప్రస్తావించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో ఎస్టీలకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని మోసం చేశారని ఆరోపణలు చేశారు.

ఉపాధిహామీ నిధులను సర్కార్ దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందని గులాబీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారని, మరి కేంద్ర పథకాలు ఎందుకు కేసీఆర్ అమలు చేయడంలేదో వారు సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. రైతులను మోసం, దగా చేస్తూ వంచిస్తోంది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. ఫసల్ బీమా పథకం తెలంగాణలో ఎందుకు అమలుచేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకం పేరు ఉంది కాబట్టి మోడీకి పేరు వస్తుందని కేసీఆర్ పలు పథకాలను రాష్ట్రంలో అమలుచేయడం లేదన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మూడున్నర కోట్ల ఇండ్లు పేదలకు కట్టించిన ఘనత మోడీదని కొనియాడారు. మరి రాష్ట్రానికి ఇండ్ల నిర్మాణానికి రూ.3 వేల కోట్లకు పైగా కేటాయిస్తే కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను గురుకులాల పేరుతో భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు. గురుకులాల్లో కల్తీ భోజనం తిని చనిపోయిన ఉదంతాలు బోలెడున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందినవారు కోకొల్లలుగా ఉన్నారన్నారు. స్మార్ట్ సిటీస్ కింద కేంద్రం వరంగల్, కరీంనగర్‌కు వందల కోట్లు కేటాయిస్తే కేసీఆర్ ఏం అభివృద్ధి చేశాడని మండిపడ్డారు. ఇప్పటి వరకు రూ.85 వేల కోట్లు కేంద్రం.. రాష్ట్రానికి కేటాయించిందని లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రిపులార్ భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సమకూర్చడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ట్రిపుల్ ఆర్ పేరుతో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఫైరయ్యారు. సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది అన్నట్లుగా తెలంగాన సర్కార్ తీరు తయారైందని మండిపడ్డారు. ఎఫ్ఆర్ బీఎం కింద తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదని లక్ష్మణ్ విమర్శలు చేశారు.

Tags:    

Similar News