కేసీఆర్ శకం ముగిసింది.. వచ్చే ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే: అర్వింద్
తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందని, అందుకు సగం సంతోషంగా ఉందని, ఇది బీఆర్ఎస్ పతనానికి ప్రారంభమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందని, అందుకు సగం సంతోషంగా ఉందని, ఇది బీఆర్ఎస్ పతనానికి ప్రారంభమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసింది. వచ్చే ఎన్నికలు బీజేపీ - కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో హుందాతనంతో కూడిన ఆరోగ్యకర పరిస్థితులు మళ్లీ వస్తాయని అన్నారు. దాడుల సంస్కృతికి స్టాప్ పడుతుందని, భాష కూడా మారుతుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపణ నిజమే అని జనం భావించారని, లిక్కర్ స్కాం కూడా ఈ పరిస్థితికి దోహదం చేసిందని వెల్లడించారు.
దేశంలోనే ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న అసెంబ్లీ ఎన్నికలుగా మారాయన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మేల్యేలు జారుకుంటారని, ప్రజల్లో అభిమానం పోయిందన్నారు. సహజ మరణం మాదిరిగా ఆ పార్టీ పతనం అవుతుందని జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన, ఆయన భాష, తీరు ఏదీ వద్దని మండిపడ్డారు.