సమంత-నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణం: MP అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసుపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసుపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. టాలీవుడ్ జంట అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని అన్నారు.. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్‌లా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వినా కొద్దీ కొత్తకొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్టయిన నాటి ఎస్ఐబీ అధికారులు.. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో ట్యాపింగ్ ఆపరేషన్ బహిర్గతమైంది. అందరి వేళ్లూ పెద్దాయన (కేసీఆర్)వైపే ఉన్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాపింగ్ ఆపరేషన్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకూ కంటిన్యూ అయింది. తాజాగా ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.