నీ వాట్సాప్ నెంబర్ చెప్పు కేటీఆర్.. తప్పులు నిరూపిస్తా: రఘునందన్ రావు
రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చేసిన తప్పులను నిరూపించి ఆయన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చేసిన తప్పులను నిరూపించి ఆయన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్లలో ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విలువలు దిగజారేలా కేటీఆర్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. మోడీని తిట్టాల్సినవన్నీ తిట్టి, ఇలా దేశమంతా తిడుతోందని, తనకు సంస్కారం ఉంది కాబట్టి తాను తిట్టట్లేదని వ్యాఖ్యానించడంపై విరుచుకుపడ్డారు. మోడీ వయసెంత? కేటీఆర్.. వయసెంత? ప్రధాని పదవికైనా కేటీఆర్ మర్యాద ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు.
ప్రధాని మోడీ, బీజేపీని డిఫెండింగ్ చేయడమే పనిగా బీఆర్ఎస్ నేతలు పెట్టుకున్నారని ఫైరయ్యారు. ప్రధాని మోడీ ఎక్కడ బ్రోకరిజం చేశాడో మంత్రి కేటీఆర్ నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు, రాజు అయ్యేది లేదు.. యువరాజు అయ్యేది కూడా ఉండబోదని జోస్యం చెప్పారు. ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెట్టడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. కానీ తొమ్మిదేండ్లుగా శ్రీకాంతాచారి ఎందుకు గుర్తుకురాలేదని, ఇప్పుడు ఎన్నికల సమయానికి గుర్తుకువచ్చాడా? అని విమర్శలు చేశారు.
హఫీజ్ పేట్‌లో భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీలు వేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. సర్వే నంబర్ 77లో 8 ఎకరాల భూమిని హైకోర్టు ఉత్తర్వులు కాదని ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, ఆ వ్యక్తికి లాభం చేకూరేలా మంత్రి కేటీఆర్ అపార్ట్ మెంట్ కట్టేందుకు అనుమతులిప్పించారని ఆయన ఆరోపణలు చేశారు. ఇది బ్రోకరిజం కాకుంటే ఏంటని ఆయన ప్రశ్నించారు. దీన్ని బ్రోకరిజం అనాలా? మూర్ఖుడు అని అనాలా అని ప్రశ్నించారు. దీనిద్వారా సదరు వ్యక్తి రూ.500 కోట్లు లబ్ధి పొందాడని, ఆ వ్యక్తి కేటీఆర్‌కే ఎలాంటి ఫేవర్ చేయలేదా సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కోర్టు సస్పెండ్ చేసిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేశారంటే ఇది బ్రోకరిజం చేస్తే జరగలేదా అనేది సమాధానం చెప్పాలన్నారు. పేపర్ లీకేజీ జరిగినా ఎంతో మంచివాడని ప్రస్తుత టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపిస్తున్నారని, గతంలో ఆయన అధ్యక్షతన ఉన్న కమిటీనే ఈ అపార్ట్ మెంట్‌కు అనుమతి ఇచ్చిందని రఘునందన్ రావు తెలిపారు.
దీన్నిబట్టి పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఎక్కడా నీతిగా, నిజాయితీగా వ్యవహరించలేదనేది అర్థమవుతోందని ఆరోపణలు చేశారు. ఈ వివరాలన్నీ మంత్రి కేటీఆర్‌కు కావాలంటే ఆయన వాట్సాప్ నంబర్ చెప్పాలని, తాను పంపించేందుకు సిద్ధమని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో విలాసవంతమైన బంగ్లాల కోసం రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయన్నారు. అన్ని తప్పులను నిరూపించి ప్రజాక్షేత్రంలో కేటీఆర్‌ను దోషిగా నిలబెడతానని హెచ్చరించారు. హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని, మరి ఇక్కడ జరిగిన అవకతవకలపై ఎందుకు నోరు మెదపడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. గతంలో మోడీపై విమర్శలు చేస్తే జైల్లో వేయాలని కేసీఆర్ డీజీపీకి ఆదేశించారని, మరి కేసీఆర్ సూచనల మేరకు మోడీని తిట్టినందుకు కూడా డీజీపీ చర్యలు తీసుకోవాలని గుర్తుచేశారు.
తెలంగాణలో కేసీఆర్ మాటలే శాసనమైతే ముందు జైల్లో వేయాల్సింది కేటీఆర్‌నే అని పేర్కొన్నారు. సిరిసిల్లలో ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే తమ యాస, భాషగా ఆయన భావిస్తే ఎమ్మెల్యేలందరినీ అత్యవసర సమావేశానికి పిలిచి బూతులను లీగలైజ్ చేయండని చురకలంటించారు. ఏ బూతులు, ఏ పదాలో మాట్లాడాలో నిర్ణయించండని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ మూడు తిడితే.. తాము 30 తిట్టగలమని, ఆయన సొంత సెగ్మెంట్, చౌరస్తాలో వచ్చి మాట్లాడే దమ్ము తమకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నొక్కిచెప్పారు. శ్రీరామనవమిలోపు మంత్రి కేటీఆర్ తన నోరును పినాయిల్‌తో కడుక్కుని నవమి తర్వాత నుంచి అయినా మాట తీరు మార్చుకోవాలని రఘునందన్ రావు సెటైర్లువేశారు.