రైతు హామీల సాధన దీక్ష విరమించిన బీజేపీ నేతలు

అధికారం కోసం దొంగ హామీలతో అన్నదాతలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అన్నదాతలకు అండగా ఉండి భరోసా నిచ్చేందుకు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించిన రైతు హామీల సాధన దీక్ష మంగళవారం ముగిసింది.

Update: 2024-10-01 17:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారం కోసం దొంగ హామీలతో అన్నదాతలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అన్నదాతలకు అండగా ఉండి భరోసా నిచ్చేందుకు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించిన రైతు హామీల సాధన దీక్ష మంగళవారం ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు మొదలైన దీక్ష.. మంగళవారం ఉదయం 11 గంటలకు ముగిసింది. సోమవారం రాత్రి ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పాటిల్, పాల్వాయి హరీష్ బాబు, పార్టీ రాష్ట్ర నాయకులు దీక్షా స్థలిలోనే నిద్రించారు. 24 గంటల పాటు దీక్ష సాగగా.. శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జీ అభయ్ పాటిల్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 8 నుంచి 9 శాతం బీ ట్యాక్స్ వసూల్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఏలేటి వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రతి నెలా కప్పం వసూలు చేసి ఢిల్లీకి వెళ్లి ఇస్తున్నారన్నారు. ట్యాక్స్ వసూల్ చేసింది ఢిల్లీ కప్పం కోసమేనా? అని ఏలేటి ప్రశ్నించారు. వసూల్, కరప్షన్ కోసమే సీఎం పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

కరెప్షన్ కి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని రేవంత్ గతంలో మాట్లాడారని, ఇప్పుడు ఆయన అదే కరప్షన్ అడ్డాలో ఉన్నాడని మహేశ్వర్ రెడ్డి చురకలంటించారు. తాను అనేక ట్యాక్స్ లు బయటపెట్టినా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే కాంగ్రెస్ స్కీమ్స్ పెడుతోందని ధ్వజమెత్తారు. టైం పాస్ కి కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నారని ఏలేటి మండిపడ్డారు. గజిని సీఎం ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఇకపోతే తుమ్మల స్టేట్మెంట్ ను ఏలేటి ఖండించారు. తాము ఎన్నడూ అమలు కాని హామీలు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారం కోసమే అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిందని పేర్కొన్నారు. అమలు చేయడం చేతకాక ఇప్పుడు పిచ్చి గా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. హామీలు అమలయ్యే వరకు రైతులకు అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు.

రేవంత్.. తెలంగాణ తుగ్లక్ : అభయ్ పాటిల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తుగ్లక్ అని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జీ అభయ్ పాటిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 9 నెలలు గడిచినా కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఉద్యమాలు చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమస్య కోసం నాయకులు వెతకాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ సర్కారే.. అనేక సమస్యలు సృష్టించి ఇస్తున్నారని, వాటిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని అభయ్ పాటిల్ సూచించారు.

రేవంత్ సైకో నా? శాడిస్టా? : ఈటల రాజేందర్

రేవంత్ ఎవరి మాట వినడం లేదని చెబుతున్నారని, మాట వినని వాడిని సైకో అంటారని, ప్రజలను ఏడిపించే వారిని శాడిస్ట్ అంటారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అలాంటిది మరి రేవంత్ సైకో నా? శాడిస్టా? అంటూ ఈటల ఫైరయ్యారు. ప్రజాక్షేత్రంలో రేవంత్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. రైతులకు చేస్తామన్న రూ.2 లక్షలను రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ ను ప్రజలు బొంద పెట్టకముందే రుణమాఫీ చేయాలన్నారు. మరో రెండు రోజుల్లో రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశంపై ఇందిరా పార్క్ వేదికగా మరో ధర్నా చేపడుతామని రాజేందర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ఉంటాడో పోతాడో.. తేలీదు : ధర్మపురి అర్వింద్

మాజీ సీఎం కేసీఆర్.. ముసలోడయ్యాడని, 75 ఏండ్లు నిండాయని, ఆయన వచ్చే ఎన్నికల వరకు ఉంటాడో పోతాడో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పోతే కేటీఆర్, కవితను చూసి కుక్కలు కూడా ఓట్లెయ్యవని ఘాటు విమర్శలు చేశారు. ఇక తుమ్మలకు సైతం వయసు మీద పడిందని, ఆయన కూడా ఏదేదో మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. ప్రతి జిల్లాకు ఈ దీక్షలను చేస్తామని ఆయన తెలిపారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చి, పెద్దలను భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేయడమే రేవంత్ కు తెలుసని ఆరోపించారు. రేవంత్ కు బ్లాక్ మెయిల్ చేయడం బాగా తెలుసన్నారు. హైడ్రా పేరుతో అలా చేసే జేబులు నింపుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చలే : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్నారని, కానీ జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చుతారని అందరూ భావించారని, కానీ ఎందుకు బచాయిస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియక ఢిల్లీ పెద్దలు 6 గ్యారెంటీలను ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. వాటిని ఎలా అమలు చేయాలనేది మాత్రం కాంగ్రెస్ నేతలకు తెలియడం లేదని చురకలంటించారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ ను మళ్లీ లేపే పని కాంగ్రెస్ పెట్టుకుందని కొండా పేర్కొన్నారు.

రేవంత్, హరీశ్ తోడు దొంగలు : పైడి రాకేశ్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇద్దరు తోడు దొంగలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నారని మండిపడ్డారు. వారిలో ఎవరో ఒకరు రాజీనామా చేయాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. హామీలు ప్రకటించినప్పుడు నిబంధనలు ఉంటాయనే విషయం రేవంత్ రెడ్డికి చెప్పేందుకు కాంగ్రెస్ నేతలకు నోరు రాలేదా అని ఆయన మండిపడ్డారు. రేవంత్ వ్యవహారం వల్ల లెజిస్లేచర్ అంతా తలదించుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లాలని, వారు చేసిన మోసం ఏంటో వారికి తెలుస్తుందన్నారు.


Similar News