BJP: రజాకార్ల వారసుల పార్టీతో అంటకాగడం సిగ్గు చేటు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

గత పాలకులు చరిత్రను మరుగున పడేసేలా కుట్రలు చేశారని, అధికారికంగా నిర్వహించకపోవడమంటే యోదుల త్యాగాలు, బలిదానాలను అవమానించడమేనని, వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే మూడేండ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలు జరుపుతున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

Update: 2024-09-17 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత పాలకులు చరిత్రను మరుగున పడేసేలా కుట్రలు చేశారని, అధికారికంగా నిర్వహించకపోవడమంటే యోదుల త్యాగాలు, బలిదానాలను అవమానించడమేనని, వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే మూడేండ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలు జరుపుతున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ వేడుకల్లో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరునా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ 15 అయితే తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 నే అని తెలిపారు. ఈ రోజు నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించి, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనదని, కానీ గత పాలకులు వాస్తవాలను ప్రజలకు తెలియకుండా చరిత్రను మరుగున పడేసే కుట్రలు చేశారని అన్నారు.

విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం

ఈ వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతో "రజాకార్" సినిమా తీసిన గూడురు నారయణ రెడ్డి అభినందనలు తెలిపారు. అలాగే భావితరాలకు నిజానిజాలు తెలియాలని మూడేండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరుపుతున్నామని అన్నారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆక్రుత్యాలను తలుచుకుంటే ఇప్పటికి నా రక్తం మరుగుతుందని, సర్దార్ వల్లభాయి పటేల్‌ లేకపోతే తెలంగాణకు అంత తొందరగా విముక్తి లభించేది కాదన్నది నగ్న సత్యం అన్నారు. దురద్రుష్టవశాత్తు రాష్ట్రంలోని పాలకులెవరూ ఇప్పటి వరకు అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకపోవడం బాధాకరమని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడమంటే నాటి సమర యోధుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమేనని మండిపడ్డారు. ఇక మేము మాట్లాడితే కొందరు మతం రంగు పులుముతున్నారని, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మేము సామాన్య ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదని చెప్పారు.

రజాకార్ల వారసుల పార్టీతో అంటకాగడం సిగ్గు చేటు

నేడు కొన్ని పార్టీలు ఆ రజాకార్ల వారసుల మెప్పు పొందేందుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని, దేశ విచ్చిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు అంటకాగడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించినోళ్లే అధికారంలోకి వచ్చాక మాట మార్చి, పేర్లు మార్చి ‘తెలంగాణ సమైక్యతా దినోత్సవం’ అని ఒక పార్టీ, ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ అని మరొక పార్టీ ప్రజలను ఏమార్చాలనుకోవడం బాధాకరమన్నారు. పిడికెడు మంది రజకార్ల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంత వరకు న్యాయమో ఆలోచించాలని, రజకార్ల వారసుల సంతూష్టీకరణ విధానాలను విడనాడాలని సూచించారు. ఇక గణతంత్ర దినోత్సవం, పంద్రాగస్టు మాదిరిగా వచ్చే ఏడాది నుండి ‘తెలంగాణ విమోచన ఉత్సవాలను’ నిర్వహంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్రం భాగస్వామి అయ్యేందుకు సిద్ధమని తెలంగాణ విమోచన పోరాట అమరవీరుల సాక్షిగా తెలియజేస్తున్నామని అన్నారు. ఇక విశ్వకర్మ జయంతి సందర్భంగా.. తెలంగాణలోని విశ్వకర్మలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేగాక నేటి రోజు మన భారత ప్రధానమంత్రి, లోక నాయకుడు నరేంద్రమోడీ పుట్టినరోజు కూడా అంటూ.. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న మహర్షి మోడీ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 


Similar News