తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్.. BRS కు చెక్ పెట్టేలా ప్లాన్

రాష్ట్రంలో ఎన్నికలకు పది నెలలు కూడా సమయం లేదు. రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ అన్ని పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Update: 2023-01-09 22:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలకు పది నెలలు కూడా సమయం లేదు. రోజులు దగ్గరపడుతున్నా కొద్దీ అన్ని పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారంలోకి రావడంపై అన్ని పార్టీలు ఎవరి ప్రణాళికలు వారు వేసుకుంటున్నారు. కాగా తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కూడా అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టిసారిస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేపడుతున్నట్లు టాక్. 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థిని ఎవరిని పెడితే బాగుంటుందనే అంశంపై ఇప్పటికే రెండు దఫాల సర్వేలు పూర్తయినట్లు వినికిడి. కాగా త్వరలోనే మూడో దఫా సర్వేను చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరు నెలల్లో ఎన్నికలు రావొచ్చనే అంచనాతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ తమ దూకుడును మరింత పెంచింది.

తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. బీఆర్ఎస్‌ను ఢీకొట్టాలంటే ఇదే అదునైన సమయంగా కాషాయ పార్టీ భావిస్తోంది. అందుకే బలమైన నేతలకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణలో బీజేపీకి ఈ అవకాశం చేజార్చుకుంటే ఇంతకంటే మంచి అవకాశం వస్తుందో లేదోననే చర్చ జరుగుతోంది. అందుకే బీజేపీ నేతలు సర్వేలు నిర్వహించి బలమైన అభ్యర్థులకు టికెట్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రెండు దఫాల్లో సర్వే పూర్తియినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దఫా సర్వే పూర్తయింది. ఇటీవల జాతీయ నాయకత్వం కూడా రెండో సారి సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా మూడో సర్వేపై రాష్ట్ర నాయకత్వం దృష్టిసారిస్తోంది. ఈ మూడు సర్వేల ఆధారంగా బలమైన నేతను గుర్తించి టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. స్థానిక నేతలకు తెలియకుండానే అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు దఫాల సర్వేను పూర్తిచేయగా, మూడో దఫాను కూడా అలాగే చేపట్టనున్నారు. థర్డ్ సర్వే త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న బీజేపీ నేతలు జాయినింగ్స్ పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. కుంభస్థలాన్ని కొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు. పొంగులేటిని బీజేపీలోకి చేర్చుకుని ఉమ్మడి ఖమ్మంను తమ ఖాతాలోకి వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కేటాయించిన గన్ మెన్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారుతున్న విషయం తెలిసే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగింది. కాగా పొంగులేటి సైతం ఇక యుద్ధమే అని ఇటీవల కామెంట్స్ చేయడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇదిలాఉండగా వాస్తవానికి ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రాబల్యం అంతంతమాత్రంగానే ఉంది. ఈ క్రమంలో పొంగులేటిని చేర్చుకుంటే ఖమ్మంపై పట్టు సాధించవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈనెల 18వ తేదీన అమిత్ షాతో కూడా ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. కాషాయ నేతలు అనుకున్నట్లుగా పొంగులేటి కాషాయతీర్థం పుచ్చుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మంపై పట్టు సాధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో భారీ ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read...

TSLPRB చైర్మన్‌గా తెలంగాణ అధికారి లేడు: రేవంత్

Tags:    

Similar News