ఢిల్లీలో మనుషులు.. కర్ణాటకలో మనస్సులు: బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​

కర్ణాటక ఎన్నికల్లో మత రాజకీయాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని బీజేపీ చీఫ్ బండి సంజయ్​ ఆరోపించారు.

Update: 2023-05-13 13:39 GMT

దిశ, కరీంనగర్​ బ్యూరో/ కరీంనగర్​ : కర్ణాటక రాష్ర్టంలో కాంగ్రెస్​ పార్టీ మత రాజకీయాలను రెచ్చగొట్టి విజయం సాధించిందని, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ సహకరించారని బండి సంజయ్​ ఆరోపించారు. కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని తన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు తగ్గలేదని సీట్లు మాత్రమే తగ్గాయని అన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి ఎన్నికల్లో 36 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో 38 శాతం ఓట్లతో 80 సీట్లు వస్తే... ఈసారి 43 శాతం ఓట్లతో 134 సీట్లు గెలుచుకుందని అన్నారు. గతంలో 20 శాతం ఓట్లు తెచ్చుకున్న జేడీఎస్ ఈసారి 13 శాతానికే పరిమితమైందన్నారు. జేడీఎస్ కు చేజారిన ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడ్డాయని ఇందుకు జేడీఎస్​ అధ్యక్షుడు అబ్రహం సహకరించాడని అన్నారు. మత రాజకీయాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి చెందిన ఓట్లు అన్ని గంప గుత్తగా కాంగ్రెస్ కే పడేలా చేశారని ఎన్నికల్లో ఎవ్వరు మత రాజకీయాల చేస్తుంది బీజేపీనా.. కాంగ్రెస్​ పార్టీనా ప్రజలు అర్ధం చేసుకుంటారని అన్నారు.

జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం స్వయంగా ఒక వర్గం ఓట్లు చీలితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసి.. ఆఓట్లన్నీ కాంగ్రెస్ కే పడేలా చేశారని సంజయ్​ ఆరోపించారు. ఎంఐఎం పార్టీతోపాటు నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన ఎన్డీపీఐ పార్టీ సైతం కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశాయని సంజయ్​ అన్నారు. బీజేపీని బూచిగా చూపి ఓట్లు దండుకున్నది కాంగ్రెస్​ పార్టీ అని, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హేళన చేసే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు చేసిందని సంజయ్​ ఆరోపించారు. కర్నాటక రాజకీయాలు తెలంగాణలో చెల్లవని, రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం తథ్యమని సంజయ్​ అన్నారు. హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతయ్యాయని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది సంజయ్​ గుర్తు చేశారు. 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని, ఎంపీ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచామని, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసే పనిచేస్తాయని సంజయ్​ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మనుషులు కలిసే ఉన్నారని, కర్నాటకలో మనసులు కలిశాయని సంజయ్​ ఆరోపించారు.

Tags:    

Similar News