BJP: ఎల్లుండి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు.. 50 లక్షల సభ్యత్వాలు టార్గెట్

బీజేపీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Update: 2024-09-06 01:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాలను టార్గెట్‌గా పెట్టుకుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈ నెల 8వ తేదీన శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 2 నుంచే మెంబర్‌‌షిప్ డ్రైవ్‌ను చేపట్టాల్సి ఉండగా, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం వాయిదా వేసింది. తొలిరోజు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మెంబర్‌‌షిప్ డ్రైవ్‌ను ప్రారంభిస్తారు. 9, 10 తేదీల్లో అన్ని జిల్లాకేంద్రాల్లో మొదలుపెట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా మెంబర్‌షిప్ డ్రైవ్ కొనసాగనుంది. ప్రతి పోలింగ్ బూత్‌లో 200 మంది సభ్యత్వాలను లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది.

ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే చేపట్టనుంది. ఈ నెల 25న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట్ర నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనుంది. క్రియాశీల సభ్యత్వంలో మొత్తం 50 వేల సభ్యత్వాలను చేపట్టాలని పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సభ్యత్వ నమోదుకు మొత్తం 7 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పార్టీ వెల్లడించింది. సభ్యత్వ నమోదుపై పార్టీ రాష్ట్ర ఆఫీసులో రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌చార్జి చంద్రశేఖర్ తివారీ జిల్లా అధ్యక్షులు, మెంబర్‌షిప్ ప్రభారీలు, మెంబర్‌షిప్ స్టేట్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. 


Similar News