Alleti Maheshwar Reddy: సీఎం సిద్ధమైతే.. వేదిక‌, డేట్, టైమ్ ఖ‌రారు చేయాలి

రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రిని ఇప్పుడు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని పిలవడం లేదని, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుచుకుంటున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.

Update: 2024-11-03 16:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రిని ఇప్పుడు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని పిలవడం లేదని, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుచుకుంటున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేని ఎగవేత‌ల స‌ర్కార్‌‌ అని మండిపడ్డారు. సీఎం చెప్పిన‌ట్టు ఆనందం, వెలుగులు వ‌చ్చింది రేవంత్ రెడ్డి కుటుంబానికి, ఆయన కోట‌రీకి త‌ప్ప సామాన్యుల‌కు కాదని ఏలేటి విమర్శలు చేశారు. బూట‌క‌పు హామీల‌తో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డ‌మే కాకుండా 11 నెల‌ల పాల‌నా కాలంలో తెలంగాణ‌ను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్ర వాస్తవ ప‌రిస్థితుల‌ను ప్రధాని మోడీ(Prime Minister Modi) ప్రజలకు తెలియ‌జేయ‌డంతో హ‌స్తం పార్టీకి వ‌ణుకు పుట్టిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇచ్చిన హామీల‌పై కాకుండా బ్లాక్ మెయిలింగ్, భూదందాలు, సెటిల్మెంట్లు, త‌న వారికి దోచిపెట్టడం, వ‌సూళ్లపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు హామీలు, నిరుద్యోగులు, పింఛన్ దారులు, మహిళలు, వ్యవసాయ కూలీల అంశంపై నేరుగా ప్రజలను కలిసే దమ్ము రేవంత్‌కు ఉందా? అని ఏలేటి సవాల్ విసిరారు. ఆచ‌ర‌ణకు సాధ్యం కాని బూట‌క‌పు హామీలు 420 ఇచ్చారని, వాటిపై ప్రజ‌ల్లోకి వెళ్లే ద‌మ్ముందా అని మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గ‌తేడాది డిసెంబరు 17న అభయహస్తం గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని అసెంబ్లీలో మాటిచ్చారని, కానీ 11 నెలలవుతున్నా అభ‌యహ‌స్తం ఆరు గ్యారంటీల‌కు చట్టబద్ధత హామీ అమలు కాలేదని విమర్శలు చేవారు.

దీనిపై ముఖ్యమంత్రి తనతో బహిరంగ విచారణకు రావాలని ఏలేటి సవాల్ విసిరారు. సీఎం సిద్ధమైతే.. వేదిక‌, డేట్, టైమ్ ఖ‌రారు చేయాలన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖ‌ర్గే చెప్పిన‌ట్టుగా బ‌డ్జెట్ లేదంటూ ఇచ్చిన హామీల‌ను రేవంత్ స‌ర్కార్ ఎగ్గొట్టాల‌ని చూస్తే స‌హించేది లేదని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలను హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోతే కాంగ్రెస్ గ‌ద్దె దిగిపోవాల్సిందే త‌ప్ప బ‌డ్జెట్ స‌హ‌క‌రించ‌డం లేద‌నే సాకులు చెబితే స‌హించేది లేదన్నారు.

Tags:    

Similar News