బిగ్ ట్విస్ట్.. రేవంత్, చంద్రబాబు భేటీలో అతి కీలకమైన టాపిక్‌పై నో డిస్కషన్..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శనివారం) ముఖాముఖీ భేటీ కాబోతున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-05 15:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శనివారం) ముఖాముఖీ భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న రెండు రాష్ట్రాల సీఎంల భేటీ అజెండా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫేస్ టూ ఫేస్ భేటీలో రాష్ట్ర విభజనకు సంబంధించిన మొత్తం 10 అంశాలపై చర్చించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించినట్లు సమాచారం. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజనతో పాటు విభజన చట్టంలో ప్రస్తావన లేని సంస్థల పంపకాలపై చర్చించనున్నట్లు టాక్. వీటితో పాటుగా ఏపీఎస్ఎఫ్సీ, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తిపన్ను పంపకం, హైదరాబాద్‌లోని భవనాల తిరిగి అప్పగింత, ఉమ్మడి సంస్థల వ్యయాల తిరిగి చెల్లింపునకు సంబంధించిన టాపిక్స్‌పై డిస్కషన్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రేపటి ఇద్దరు సీఎంల భేటీకి ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్ ఈ భేటీలో పాల్గొననున్నట్లు టాక్. వీరితో పాటు ఏపీ సీఎస్‌, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు రానున్నట్లు సమాచారం. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి ఈ భేటీలో పాల్గొననున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే, రేవంత్, చంద్రబాబుల భేటీకి ముందు ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై చర్చ జరగనున్న ఈ కీలక భేటీలో.. రెండు రాష్ట్రాల మధ్య ఉప్పు-నిప్పులా ఉన్నా కృష్ణ జలాల నీటి వాటాల పంపిణీ అంశం జోలికి వెళ్లొద్దని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణ జలాల నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ మధ్య ఎప్పటి నుండో వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

బ్రిజేష్ ట్రిబ్యూనల్‌తో పాటు కోర్టుల్లోనూ ఈ అంశానికి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్‌పై డ్యామ్‌పై రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్లారు. రెండు రాష్ట్రాల పోలీసులు భారీగా బలగాలను మోహరించడంతో సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ నేపథ్యంలోనే ఇంతటి సీరియస్ ఇష్యూపై రేవంత్, చంద్రబాబుల ముఖాముఖీ భేటీలో చర్చించొద్దని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఈ టాపిక్‌పై డిస్కషన్ జరగదని ప్రచారం జరుగుతోంది. మరీ, బాబు, రేవంత్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత కీలకమైన కృష్ణ నది జలాల పంపకం ఇష్యూపై చర్చిస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.


Similar News