కేసీఆర్ కు షాక్.. బీఆర్ఎస్ మీటింగ్ కు 8 మంది ఎమ్మెల్యేలు డుమ్మా

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి.

Update: 2024-07-05 09:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పగా నిన్న ఒకే దఫాలో ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అంతా అయోమయంగా మారింది. పార్టీలో కొనసాగే వారెవరో, వీడే వారెవరో ఎవరికీ అంతు చిక్కడం లేదు. గత రాత్రి ఎమ్మెల్సీల జంపింగ్ వ్యవహారం పార్టీలో సంచలనంగా మారగా ఇవాళ తెలంగాణ భవన్ లో అధిష్టానం నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల మీటింగ్ కు ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం కొత్త చర్చకు దారితీసింది. చేరికలు ఇంతటితో ఆగలేదని త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో చేతులు కలపడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న వేళ గులాబీ అధిష్టానం ఆహ్వానించిన మీటింగ్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. దీంతో కారు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ డైలామాలో పడినట్లు తెలుస్తోంది.

కీలక నిర్ణయం వేళ ఎమ్మెల్యేల గైర్హాజరు!:

రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతున్నది. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి రాజీనామా కోసం పట్టుబట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా రేపటి కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు రావాల్సిందిగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు గులాబీ పార్టీ పెద్దలు సమాచార అందించినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి పిలుపు వచ్చినప్పటికీ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే, మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాఠాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు గైర్హాజరు అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే బీఆర్ఎస్ కు 47 మంది ఉన్న కార్పొరేటర్లు ఉండగా కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. నిజానికి ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ అడ్వకేట్స్ తో మంతనాలు జరుపుతున్నారు. దాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగింది.

నేడో రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్:

కాంగ్రెస్ లోకి చేరికల పరంపర కంటిన్యూ అవుతున్నది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరికల విషయంలో ఎత్తుకు పై ఎత్తులతో కాంగ్రెస్ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది. హస్తం పార్టీ వ్యూహానికి కేసీఆర్ అస్త్రాలు పని చేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలోనే బీఆర్ఎస్ వదిలి అధికార పార్టీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మీటింగ్ కు ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Tags:    

Similar News