Ponguleti Srinivasa Reddy : పొంగులేటికి బిగ్ షాక్..!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు రాజకీయంగా బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకోనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న తెల్లం బీఆర్ఎస్ జిల్లా నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తెల్లం గులాబీ కండువా తిరిగి కప్పుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే తెల్లం చేరిక విషయంలో మూడు నెలలుగా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు సీక్రెట్ గా చేపట్టిన టాస్క్ ఎట్టకేలకు ఫలించినట్లు, తెల్లం రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు డాక్టర్ తెల్లం వెంకట్రావ్ అనుచరులతో కలిసి బుధవారమే హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం.
దిశ, చర్ల : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు రాజకీయంగా బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. పొంగులేటికి కష్టకాలంలో అండగా నిలిచేది ఆయన అనుచరులే అన్నది యధార్థం. బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసీటు గెలవకుండా చేస్తానని శపథం చేసిన పొంగులేటి రాజకీయ బలం ఆయన అనుచరులే అని గ్రహించిన బీఆర్ఎస్ బిగ్ బాస్ ఒక్కొక్కరిగా ఆయనకు దూరం చేసేలా స్కెచ్ వేశారు. బిగ్ బాస్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం ముందుగా తెల్లం వెంకట్రావుతో చర్చలు జరిపి సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా భద్రాచలం టిక్కెట్ ఇక తనకు రాదని తెలుసుకున్న వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కచ్చితమైన హామీ పొంది పార్టీ మారడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌ని కలవడానికి తన ముఖ్య అనుచరులతో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళినట్లుగా సమాచారం. అంతా ఒకే అనుకుంటే గురువారమే సీఎం చేతుల మీదుగా వెంకట్రావు బిఆర్ఎస్ కండువా కప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ నుంచి టికెట్ రాదనే..
భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్యని కాదని పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వదని గ్రహించి బిఆర్ఎస్ టిక్కెట్ కోసం వేగంగా పార్టీ మారడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. డాక్టర్ తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన తదనంతర తెలంగాణ రాజకీయ పరిణామాల్లో భాగంగా అప్పటి ఖమ్మం ఎంపి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట అడుగులు వేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమిచెందారు. అయినప్పటికీ తెల్లం వెంకట్రావుకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతని సీఎం కెసిఆర్ అప్పగించారు.
2023 ఎన్నికల్లో భద్రాచలం బిఆర్ఎస్ టిక్కెట్ తెల్లంకే దక్కుతుందని అంతా అనుకున్నారు. ఓసారి ఎంపీ, మరోమారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిపాలైన డాక్టర్ తెల్లం వెంకట్రావుకి పెరిగిన రాజకీయ అనుభవానికితోడు వరుసగా రెండుసార్లు ఓటమి వలన ఈసారి సానుభూతి ఓట్లుపడి గెలవొచ్చనే టాక్ వినిపించింది. ఈ విషయంలో తెల్లం కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన రాజకీయ జీవితం అలా సాఫీగా సాగిపోతున్న తరుణంలో సీఎం కెసిఆర్‌తో వచ్చిన రాజకీయ విభేదాల నేపథ్యంలో తన రాజకీయ గురువు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, పొంగులేటి ముఖ్య అనుచరుల్లో ఒకరైన తెల్లం వెంకట్రావు సైతం అదే వేదికపై కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పొంగులేటి ఇచ్చిన భరోసాతో కాంగ్రెస్‌లో చేరినా భద్రాచలం సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఉండగా సీటు తనకు రావడం కష్టమే అనే భావనతో తెల్లం కొంత ఆందోళనలో ఉన్నారు.
ఖమ్మం జిల్లా నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు గెలవకుండా అడ్డుపడతానని ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు దీంతో రాజకీయంగా పొంగులేటిని దెబ్బతీయడం కోసం సీఎం కెసిఆర్ వ్యూహాత్మకంగా ఃపొంగులేటికి అనుచరులే రాజకీయ బలమని గ్రహించి ఒక్కొక్కరిగా వారిని దూరం చేయడానికి స్కెచ్ వేసి రాష్ట్ర , ఉమ్మడి ఖమ్మం నేతలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అయితే పొత్తులో ఈ సీటు చివరి క్షణంలో సీపీఎం ఎగిరేసుకపోతే మళ్ళీ తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని తెల్లం వెంకట్రావు కొంత డైలామాలో పడగా, అదే అనుమానమైతే ముందుగానే బిఫారం అందజేస్తామని, అదే క్రమంలో తెల్లం డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందిన తెల్లం తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కలవడానికి హైదరాబాద్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అక్కడ అంతా అనుకున్నట్లుగా జరిగితే సీఎం చేతుల మీదుగా గురువారం తెల్లం మరోమారు బిఆర్ఎస్ కండువా కప్పుకొనే చాన్స్ కనిపిస్తోంది.
టాస్క్ పూర్తిచేసిన తాత మధు..
తెల్లం వెంకట్రావ్ ను బీఆర్ఎస్ లో చేర్పించేందుకు గత మూడు నెలలుగా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు ప్రయత్నించి సఫలమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు తెల్లంకు ఉన్న డౌట్లను క్లారిఫై చేసిన తర్వాతే డాక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏదిఏమైనా పొంగులేటి అనుచరులను బీఆర్ఎస్ లో కి తేవడంలో కీలకమైన తాత మధు.. మరికొందరిపై కూడా దృష్టి పెట్టి పార్టీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్న తెలుస్తుంది.