కేసీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. రివ్యూలో చేతులెత్తేసి కుండబద్దలు కొట్టిన అధికారులు!

మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌కు మేడిగడ్డ ఉచ్చు బిగుస్తున్నది. బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు రావడం, కుంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2023-12-19 01:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌కు మేడిగడ్డ ఉచ్చు బిగుస్తున్నది. బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు రావడం, కుంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిర్మాణ పనులపైనా, బ్యారేజీ నాణ్యతపైనా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌ను తాము రూపొందించలేదని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులు పలు కీలక అంశాలను వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీని తాము డిజైన్ చేయలేదని, దానితో తమకు సంబంధమే లేదని, మొత్తం పనులు కేసీఆర్ చెప్పినట్టుగానే చేశామని వివరణ ఇచ్చినట్టు ఆ సమావేశంలో పాల్గొన్న ఒకరి ద్వారా తెలిసింది.

అప్పట్లో ఆయన మాటలకు తాము ఎదురు చెప్పలేకపోయామని, ఆయన ఆదేశాలకు అనుగుణంగానే బ్యారేజీని నిర్మించామని ఆన్సర్ ఇచ్చినట్టు తెలిసింది. నిపుణుల సలహాలు, సూచనలు లేకుండా లేకుండా బ్యారేజీ‌ని ఎలా డిజైన్ చేశారంటూ ఎల్ అండ్ టీ ప్రతినిధులను మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పినట్టుగా బ్యారేజీ నిర్మించిన సంగతేమోగానీ.. బ్యారేజీకి జరిగిన డ్యామేజీకి ఎవరిది బాధ్యత అని నిలదీశారు. భారీ ఖర్చుతో కట్టిన బ్యారేజీ నాలుగైదేండ్లకే ఇలా తయారైందంటే నిర్మాణ సంస్థకు బాధ్యత లేదా అని సీరియస్ అయినట్టు సమాచారం. ‘జరిగిన డ్యామేజీకి కేసీఆర్‌ను బాధ్యుడిని చేయాలనేదే మీ ఉద్దేశమా?.. మీరు సేఫ్ సైడ్‌లోకి వెళ్లాలనుకుంటున్నారా?..’ అంటూ ఫైర్ అయినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

న్యాయ విచారణకు సిద్ధమవుతున్న సర్కారు

మేడిగడ్డ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రస్తావించిన రేవంత్‌‌రెడ్డి.. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాతా ఆ విషయాన్ని నొక్కిచెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనమండలిలో చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ జడ్జి‌తో దర్యాప్తు జరిపిస్తామని, వచ్చే నివేదికకు అనుగుణంగా ఎవరిని బాధ్యులను చేయాలో తేలుస్తామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.

కమిటీ ముందు కేసీఆర్ హాజరు?

సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు జరిపిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చట్టసభలో స్పష్టం చేయడంతో ఆ దిశగా కదలికలు మొదలయ్యాయి. త్వరలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన సంస్థల ప్రతినిధులను కూడా పిలవాల్సిందిగా రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందంటూ స్వయంగా ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పినందున జ్యుడీషియల్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే కేసీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందన్నది సచివాలయ వర్గాల సమాచారం. డిజైన్ విషయంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పే వాదనకు, ఇరిగేషన్ అధికారులు చెబుతున్న మాటలకు మధ్య తేడా ఉండడంతో కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రాజెక్టును డిజైన్ చేసిన కేసీఆర్, పర్యవేక్షించిన ఇంజినీర్లు, కట్టిన కాంట్రాక్టర్లు.. అందరినీ విచారిస్తామని సీఎం రేవంత్ స్పష్టంగా పేర్కొనడంతో అప్పటి సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావును, ఇరిగేషన్ సెక్రటరీని సైతం విచారణకు పిలిచే అవకాశాలున్నట్టు ఆ వర్గాల సమాచారం. జ్యుడీషియల్ కమిటీ సమర్పించే రిపోర్టు ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే అంశాన్నీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యానించినందున మేడిగడ్డ వ్యవహారం చివరకు ఎవరి మెడకు చుట్టుకుంటుందనే చర్చలు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని మొదటినుంచీ కాంగ్రెస్ ఆరోపించింది. ఏటీఎంలా మారిందంటూ ప్రధాని మొదలు అమిత్ షా, జేపీ నడ్డా వరకు పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు.

వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ తీసుకోబోయే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ మీటింగులతో పాటు సీఎం నిర్వహించి సమీక్షా సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలు, ప్రజాధనం దుర్వినియోగంలోని నిజానిజాలు తేటతెల్లం కావాల్సిందేనన్న ప్రభుత్వ ఆలోచన రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎలాంటి కఠోర వాస్తవాలు తెరపైకి వస్తాయో అనే అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా ‘వారు సభలో ఉండాల్సిందే.. కఠోర నిజాలను వారు వినాల్సిందే..’ అని కామెంట్ చేసిన నేపథ్యంలో ఆ నిజాలను సభ ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News