బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్‌లోకి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు!

ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ ను వరుస షాక్‌లు కుదిపేస్తున్నాయి.

Update: 2023-09-23 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ ను వరుస షాక్‌లు కుదిపేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారంటీల ఇంపాక్ట్‌తో బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ తొలి జాబితాలో తన కుమారుడికి సీటు నిరాకరించారని ఆగ్రహంగా ఉన్న మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.

ఇటీవల రేఖా నాయక్ భర్త శ్యాంనాయక్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవాలని భావించిన శ్యాంనాయక్ రవాణాశాఖ అధికారి ఉద్యోగానికి సైతం వీఆర్ఎస్ ప్రకటించారు. రెండు సార్లు వరుసగా ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి గెలిచిన రేఖా నాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఈ సారి గెలిస్తే మంత్రి పదవి డిమాండ్ చేయొచ్చని భావించారు. కాగా తొలి జాబితాలో రేఖానాయక్‌కు గులాబీ బాస్ షాక్ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్ స్నేహితుడు భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు అనూహ్యంగా ఖానాపూర్ టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్న రేఖా నాయక్ నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. రేఖా నాయక్, మైనంపల్లి, వేముల వీరేశం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఒకే సారి ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధం కావడంతో కారు పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది.

Tags:    

Similar News