BIG Scam: బతుకమ్మ చీరల స్కీమ్‌లో రూ.1,000 కోట్ల స్కామ్..? బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు!

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల స్కీంలో సుమారు రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని తెలుపస్తోంది.

Update: 2024-08-09 01:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల స్కీంలో సుమారు రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని తెలుపస్తోంది. ఈ స్కామ్‌లో ‘గులాబీ’ లీడర్ల బినామీలే సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు చీరలు కొనుగోలు చేసి.. ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చూపించి ప్రభుత్వానికి అప్పగించినట్టు ఆరోపణలున్నాయి. ‘బతుకమ్మ’ చీరల స్కీంలో అవినీతి జరిగిందని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌ను బయట పెట్టేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏడేళ్లలో రూ.2,170 కోట్లు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ప్రతి యేటా సుమారు రూ.350 కోట్లు విడుదల చేసేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బతుకమ్మ చీరల పంపిణీ పథకం కొనసాగింది. ఈ ఏడేండ్ల కాలంలో ఈ స్కీం కోసం ప్రభుత్వం రూ.2,170 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో సగం డబ్బు అంటే సుమారు రూ.వెయ్యి కోట్లు మధ్యవర్తులే కొల్లగొట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసింది. చీరల తయారీకి ఎంత ఖర్చు అయ్యేది? ఎక్కడ తయారు చేసేవారు ?.. నిజంగా చేనేత కార్మికులకే పని దొరికేదా? లేకపోతే ఎవరు తయారు చేసేవారు? ఈ దందాలో ఎంత మొత్తం చేతులు మారేది? అనే అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

గులాబీ లీడర్లే సూత్రదారులు?

బతుకమ్మ చీరల పేరుతో జరిగిన దోపిడీలో గులాబీ పార్టీ లీడర్ల సన్నిహితులే పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సూరత్, బీవండి నుంచి బల్కుగా అతి తక్కువ ధరకు వస్త్రాన్ని కొనుగోలు చేసి, వాటిని పీసులుగా కట్ చేసి, రంగులు అద్దే వారని సమాచారం. ఒక్కో చీరకు రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చు అయితే ప్రభుత్వం నుంచి రూ.200 నుంచి రూ.250 వరకు వసూలు చేసే వారని విశ్వసనీయ సమాచారం. ఇలా ప్రతి యేటా ప్రభుత్వం నుంచి ఆ దళారులు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు దోచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

పథకంపై మొదటి నుంచీ విమర్శలే

బతుకమ్మ చీరల నాణ్యతపై ప్రతి యేటా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి. మెజార్టీ మహిళలు వాటిని కట్టుకునేవారు కాదు. ‘నాణ్యతలేని చీరలు ఇచ్చారు.. మీ ఇంట్లోని మహిళలు ఇవే చీరలు కట్టుకుంటారా?’ అంటూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి. కొందరైతే రోడ్డు మీదికి వచ్చి కాల్చి వేసిన ఘటనలనూ మనం చూశాం. నాణ్యత లేని చీరలు ఇవ్వడం వల్ల ఏనాడూ మహిళలు సంతృప్తి చెందలేదు. అదే విధంగా చేనేత కార్మికులకు సైతం న్యాయం జరగలేదు.

చీరల పంపిణీ పథకానికి బ్రేక్..

కొత్త స్కీం ప్రవేశ పెట్టే యోచనలో కాంగ్రెస్ చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకం అడ్డదారులు తొక్కడంతో పాటు మధ్యవర్తులే ప్రయోజనం పొందినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈ స్కీమ్‌కు బ్రేక్ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశ పెట్టాలని భావిస్తున్నది. నూలు, రంగుల కొనుగోళ్లలో సబ్సిడీ ఇచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొందరు కార్మికులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మరోసారి ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కోసం అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలనూ ఇక్కడ అమలు చేసే అవకాశం ఉందా? అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News