బీఆర్ఎస్ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. తొలగిన కన్ఫ్యూజన్!

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కోసం ఆతృతగా ఎదురుచూసిన బీఆర్ఎస్ అభ్యర్థులకు టెన్షన్ వదిలింది.

Update: 2023-09-20 02:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కోసం ఆతృతగా ఎదురుచూసిన బీఆర్ఎస్ అభ్యర్థులకు టెన్షన్ వదిలింది. మహిళా రిజర్వేషన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకూ మహిళా రిజర్వేషన్ కోటాలో సీటు ఉంటుందో, ఎగిరిపోతుందేననే సందేహం వారిని వెంటాడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్టీలకంటే ముందుగానే టికెట్లను ప్రకటించినా, పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో మహిళా బిల్లు రానున్నట్లు వార్తలు రావడం వారిని నిద్రపోనివ్వలేదు. మహిళా కోటాలోకి తమకు కేటాయించిన సీట్లు వెళ్లిపోతే ఎలా అనే డైలమాలో నేతలు పడ్డారు. దీంతో బీ-ఫామ్ వచ్చేదాకా నమ్మకం లేదని అనుకున్నారు. ఇప్పుడు లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టడంతోనే వారి అనుమానాలు నివృత్తి అయ్యాయి. తమకు కేటాయించిన స్థానం పదిలమనే భరోసా ఏర్పడింది.

‘స్పెషల్ సెషన్’తో టెన్షన్

పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంటుందనే ఊహాగానాలు రావడంతోనే బీఆర్ఎస్ అభ్యర్థుల్లో అలజడి మొదలైంది. ఆ బిల్లుపై తగిన క్లారిటీ లేకపోవడంతో పార్టీ అధినేత కూడా డైలమాలో పడ్డారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న సీనియర్లే ఆ బిల్లుపై కేసీఆర్‌కు కూడా క్లారిటీ లేదని వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వెంటనే అమల్లోకి వస్తుందనే అభిప్రాయమే పార్టీ నేతల్లో వ్యక్తమైంది. దీంతో తొలి జాబితాలో మహిళలకు సీట్లు రిజర్వు చేయాల్సి ఉంటుందేమోననే చర్చలూ జరిగాయి. ఆ బిల్లుపై స్పష్టత వచ్చేంతవరకూ ఏమీ చెప్పలేమని సైలెంట్‌గా ఉండిపోయారు. జాబితాలో పేర్లు ఉన్నా చివరికి ఏమవుతుందోననే గందరగోళంతో అభ్యర్థులూ టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా ప్రచారంలో దూకుడును కూడా తగ్గించుకున్నారు.

ప్రచారంపై ఫోకస్

మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఇప్పటికిప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తేలిపోవడంతో అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైతే తమ సీటు పదిలమేనని, మళ్లీ ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి చూసుకుందామని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికలకు మహిళా కోటా చిక్కుల్లేవని క్లారిటీ రావడంతో పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ప్రచారంపై ఫోకస్ పెట్టారు. పార్లమెంటు ప్రత్యేక సెషన్ కన్‌ఫ్యూజన్ దాదాపు రెండు వారాల పాటు వారిని గందరగోళంలోకి నెట్టింది. ప్రచారం చేసుకోడానికి, ఖర్చు పెట్టడానికి వెనుకాడారు. ఈ నెల 2న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ ద్వారా నెలకొన్న గందరగోళం 19వ తేదీన లోక్‌సభలో పెట్టిన బిల్లుతో కొలిక్కి వచ్చినట్లయింది. జాబితా మార్చాల్సి వస్తుందేమోననే టెన్షన్ నుంచి పార్టీ అధినేతకు కూడా రిలీఫ్ లభించింది.

Tags:    

Similar News