Big News: కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు..! పైరవీలకు నో చాన్స్

పైరవీలకు ఆస్కారం లేకుండా, కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన లీడర్లకే విద్యా, బీసీ, వ్యవసాయ కమిషన్లలో చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

Update: 2024-09-06 01:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పైరవీలకు ఆస్కారం లేకుండా, కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన లీడర్లకే విద్యా, బీసీ, వ్యవసాయ కమిషన్లలో చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మూడు కమిషన్లలో చోటు దక్కించుకునేందుకు చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు. అందులో కొందరు ఏఐసీసీ నుంచి సిఫారసు లెటర్లు తెస్తుండగా, ఇంకొందరు ఫోన్లు చేయించుకుంటునట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ మూడు కమిషన్లకు చైర్మన్, మెంబర్లుగా ఎవరిని నియమించాలనే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన లీడర్లకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా, అక్కడ్నించి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల తెలిపాయి. దీంతో త్వరలో బీసీ, విద్యా, వ్యవసాయ కమిషన్లను భర్తీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.

చైర్మన్లుగా మురళి, నిరంజన్, కోదండ‌రెడ్డి?

ఈ మధ్యే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి పేరు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. బీసీ కమిషన్ చైర్మన్‌గా పార్టీ సీనియర్ నేత నిరంజన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి, అఖిలభారత కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డిలను అపాయింట్ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ ఉంది. అయితే ఆ మూడు కమిషన్లలో మెంబర్లుగా పార్టీ విజయం కోసం పనిచేసిన జర్నలిస్టులు, విద్యావేత్తలు, అగ్రికల్చర్ ఎక్సపర్ట్స్ కు ప్రయారిటీ ఇచ్చే అవకాశమున్నదనే చర్చ జరుగుతున్నది.


Similar News