BIG News: సహకారమా.. సమరమా? వదర సాయం అందకపోతే కేంద్రంతో కొట్లాటే

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని పూడ్చేలా కేంద్రం ఎంత సాయం ఇస్తుందనేది కీలకంగా మారింది.

Update: 2024-09-12 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని పూడ్చేలా కేంద్రం ఎంత సాయం ఇస్తుందనేది కీలకంగా మారింది. గతంలో రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలకు భారీ నష్టం జరిగినా కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందలేదు. గుజరాత్‌కు నిధులిచ్చి తెలంగాణను విస్మరించిందంటూ అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రధాని మోడీని విమర్శించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రాష్ట్రంలో సుమారు రూ. 5,438 కోట్ల మేర నష్టం జరిగిందని సీఎం రేవంత్ ఓపెన్‌గా చెప్పడంతోపాటు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మీటింగ్ సందర్భంగానూ వివరించారు. ఆశించిన మేరకు నిధులిచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరగా... రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేస్తామని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. స్వయంగా ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సహకారంపై సీఎం విజ్ఞప్తి చేయనున్నారు.

ఆశించిన సాయమందితే..

‘రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్లుగా కేంద్రం నుంచి వరద సాయం అందితే కేంద్ర ప్రభుత్వానికి సహకరించే అవకాశాలున్నాయి. లేనట్లయితే గత ప్రభుత్వంలో సెంటర్-స్టేట్ ఫైట్ తరహా సన్నివేశం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ ప్రస్తావనతో మెలిక పెడితే అది పరోక్షంగా మొండి చేయి చూపినట్లే.’ ఇవీ ఇప్పుడు రాజకీయ నేతల్లో జరుగుతున్న చర్చ. ప్రధానిని కలిసి మొరపెట్టుకున్నా రాష్ట్రానికి కేంద్రం సహకరించడంలేదనే విమర్శను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచినా ప్రయోజనం లేదనే అపవాదునూ మూటగట్టుకోవాల్సి ఉంటుంది. సమగ్రంగా ఏయే రూపాల్లో ఎంత నష్టం జరిగిందో వివరమైన నివేదికను ప్రధానికి సీఎం సమర్పించనున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలను వివరించడంతోపాటు సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు పెద్ద మనసు చూపాలని కోరే అవకాశమున్నది.

కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలను స్వయంగా పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతుల నుంచే అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులతోనూ సమావేశమై ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను తెలుసుకున్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుకుంటున్నదో స్వయంగా ఆయనకే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వివరించారు. కచ్చితంగా కేంద్రం తరఫున సాయం చేస్తామంటూ ఆయన హామీ ఇవ్వగా.. వరద నష్టంలో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఏమీ తక్కువ లేదని, కేంద్రం ఇచ్చే సాయం కూడా ఆ రాష్ట్రంతో సమానంగా ఉండాలని, రెండు రాష్ట్రాల్లోని నష్టాన్ని ఒకే తీరులో చూడాలని సీఎం ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల్లోని చిక్కులను కూడా కేంద్ర మంత్రికి వివరించారు.

వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వరద సాయం ఏ మేరకు అందుతుందనేది కీలకంగా మారింది. ఒకవైపు గతంలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడూ రిపీట్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారానికి బదులుగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొనే అవకాశమున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు తక్కువ నిధులిస్తే వివక్షతో వ్యవహరించిందనే ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాజకీయాలకు తావులేదని కేంద్ర మంత్రి హైదరాబాద్‌లో నొక్కిచెప్పినా కేంద్రం తీరు మాత్రం దానికి తగినట్లుగా లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ సరికొత్త రూపం తీసుకునే అవకాశమున్నది. వరద బాధిత ప్రాంతాల్లో బీజేపీ ఎంపీల నేతృత్వంలో బృందాలు పర్యటించినా కేంద్రం నుంచి నిధులను తేలేకపోయారనే విమర్శలను కాచుకోవాల్సి వస్తుంది.

అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షం!

కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి వరద సాయం తెచ్చుకునేందుకు అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఈ డిమాండ్ చేశారు. ఏకకాలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ విమర్శలను ఎదుర్కావాల్సి వస్తుంది. సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయనే అంశంపై ఆధారపడి రాష్ట్రంలో భవిష్యత్తులో రాజకీయ ముఖచిత్రం ఊహించని తీరులో మారనున్నది. బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వరద నష్టం సాయం అంశాన్ని రాజకీయంగా వాడుకునే అవకావం లేకపోలేదు. ప్రధాని మోడీ, అమిత్ షా లను సీఎం రేవంత్ కలిసి ముఖాముఖిగా వరద సాయంపై చర్చించడం పొలిటికల్‌గా సరికొత్త వ్యూహానికి దారితీయనున్నది.


Similar News