BIG New: జంకుతున్నారా..! అరెస్టుకు భయపడుతున్నారా?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు కేసుల భయం పట్టుకుందా?
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు కేసుల భయం పట్టుకుందా? కేసులు ఉంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే జంకుతున్నారా? అందుకే తనపై నమోదైన కేసులను కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సమయంలో డ్రోన్ ఉపయోగించారు. దీనిపై ఇంజినీరింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ లీడర్లపై పోలీసు కేసు నమోదైంది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే కేటీఆర్ అండ్ టీమ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారని చర్చ జరుగుతున్నది.
భయంతోనే క్వాష్ పిటిషన్ ?
గత నెలలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో బ్యారేజీ వద్ద డ్రోన్‌లను ఉపయోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించినందుకు ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల టీమ్‌ను లీడ్ చేసినందుకు కేటీఆర్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన వారం రోజులు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ అండ్ టీమ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. ఆలస్యమైతే ఎక్కడ ఆరెస్టు చేసి, జైలుకు పంపుతారేమోనని భయంతోనే క్వాష్ పిటిషన్ వేశారని చర్చ గులాబీ పార్టీలో జరుగుతున్నది. ‘ఒక పిల్లర్ కుంగడంతో బ్యారేజీ పనికిరాకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అది వాస్తవం కాదని చెప్పేందుకే డ్రోన్ కెమెరాల ద్వారా బ్యారేజీని షూట్ చేశాం, ఇదే విషయాన్ని విచారణ సమయంలో కోర్టుకు చెప్పితే బాగుండేది. కానీ అరెస్ట్ చేస్తారనే భయంతోనే మా లీడర్లు క్వాష్ పిటిషన్ వేశారు.’ అని బీఆర్ఎస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి కామెంట్ చేశారు.
సీన్ రిపీట్ అవుతుందనే టాక్
బీఆర్ఎస్ హయంలో డ్రోన్ కేసులో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లారు. 2020లో చేవేళ్ల నియోజకవర్గ పరిధిలోని జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై డ్రోన్ ఉపయోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగరేసినందుకు పోలీసులు రేవంత్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్రనగర్ కోర్టు రేవంత్‌ను 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపింది. ఇప్పుడు అదే తరహాలో మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా డ్రోన్ ఉపయోగించినందుకు పోలీసులు బీఆర్ఎస్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు చార్జిషీట్ వేసేలోపే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం, సెప్టెంబరు 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడంతో గులాబీ లీడర్లు ఊపిరి పీల్చుకున్నారనే టాక్ ఉంది. అయితే కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించారని, ఆయన తప్పుకుండా జైలుకు వెళ్లకతప్పదని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. హైకోర్టు విధించిన గడువులోపు పోలీసులు రిపోర్టు ఇస్తారని, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారని అంచనా వేస్తున్నారు.