Heavy rains:తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింప జేస్తున్నాయి.

Update: 2024-08-02 01:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింప జేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జూలై నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. తాజాగా మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఈ ఏడాది ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని వయనాడ్ ప్రాంతంలో మరణ మృదంగం మోగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కూడా మరో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ సూచించింది. పశ్చిమ భారత్‌లో రుతుపనాలు చాలా యాక్టివ్‌గా ఉన్నందున వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు సూచించారు. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News