Big Alert : శబరిమల భక్తులకు రైల్వేశాఖ బిగ్ అలర్ట్
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల(Shabarimala)కు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) కీలక సూచన చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల(Shabarimala)కు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) కీలక సూచన చేసింది. భక్తులు రైళ్లలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని.. కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. యాత్రికులు కోచ్‌ల లోపల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అందులో భాగంగా కర్పూరం వెలిగించడం, హారతులు ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాణి వెలిగించడం వంటివి చేస్తున్నట్టు రైల్వే అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఇలాంటి కార్యక్రమాల వలన ఒకోసారి తీవ్ర అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున, రైళ్లలో అలాంటివి చేయొద్దని ప్రయాణికులక విన్నవించింది.
ఇదిలా ఉంటే.. శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ తదితర స్టేషన్ల నుంచి బయలుదేరి పలు స్టేషన్లలో ఆగనున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికుల సహకారం కావాలని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. రైళ్లలో, రైలు ప్రాంగణాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేసింది. మండే స్వభావం గల పదార్థాలతో ప్రయాణాలు చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించడం నిషేధించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.