జెన్కో ఏఈ పరీక్ష అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మూడు ఎగ్జామ్ సెంటర్లు చేంజ్..!
జెన్కో నిర్వహించే అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్), కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహిస్తున్న పరీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో: జెన్కో నిర్వహించే అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్), కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జెన్కో సీఎండీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌లైన్ పద్ధతిన నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఒక సెంటర్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్లే ఈ కేంద్రాలను మారుస్తున్నట్లు స్పష్టంచేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ఆదివారం పరీక్ష నిర్వహిస్తుండగా చివరి నిమిషంలో ఇలా మారుస్తూ నిర్ణయం తీసుకోవడమేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్(టీసీ కోడ్-33905)లో ఫస్ట్ షిఫ్ట్‌లో భాగంగా మెకానికల్ అండ్ కెమిస్ట్ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత చెప్పారు. కానీ ఆ సెంటర్‌లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో భోజ్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్(టీసీకోడ్-1732) సెంటర్‌కు మార్చారు. ఈ కళాశాల రంగారెడ్డి జిల్లా సైదాబాద్‌లోని సంతోష్ నగర్, వినయ్ నగర్‌లో ఉంది. సెకండ్ షిఫ్టులో ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన అభ్యర్థులకు కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్(టీసీ కోడ్-33905)లో పరీక్ష ఉండగా దాన్ని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు మార్చారు. ఈ కళాశాల బాలాపూర్ మండల పరిధిలోని నాదర్‌గుల్ గ్రామం వద్ద ఉంది.
మూడో షిఫ్టులో ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ అభ్యర్థులకు కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్(టీసీ కోడ్-33905)లో పరీక్ష ఉండగా దాన్ని భోజ్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్(టీసీ -కోడ్-1732)కు మార్చారు. ఈ కళాశాల సైదాబాద్ లోని సంతోష్ నగర్, వినయ్ నగర్ వద్ద ఉంది. కాగా అభ్యర్థులు www.togenco.com వెబ్‌సైట్ నుంచి సవరించిన హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా పరీక్షకు హాజరుకావాలని సూచించారు.