హాట్ న్యూస్: CM రేవంత్, చంద్రబాబుల బంధంపై భట్టి సంచలన వ్యాఖ్యలు
పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 6వ తేదీన తెలంగాణ సీఎం
దిశ, వెబ్‌డెస్క్: పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 6వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్ ఈ ఆసక్తికర భేటీకి వేదిక కాబోతుంది. ప్రజా భవన్‌లో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ అయ్యి.. రాష్ట్ర విభజన చట్టంలో ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉన్న అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రుల హోదాలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు తొలిసారి సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఈ భేటీపై రెండు తెలుగు స్టేట్స్‌లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సరిగ్గా రెండు రోజుల ముందు.. రేవంత్, చంద్రబాబులపై బంధంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు అని ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలకు తాజాగా ఆయన కౌంటర్ ఇచ్చారు.
గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో బంధంపై రేవంత్ రెడ్డి చాలా సార్లు బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు కాదని.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచరుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు, రేవంత్ గురు శిష్యులు అనే కొందరు చేసేవి అవగాహన లేని మాటలని కొట్టి భట్టి పారేశారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై ముఖాముఖీ భేటీ అయ్యి చర్చిద్దామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు ప్రతిపాదన పంపిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈ నెల 6వ తేదీన భేటీకి ఒకే చెప్పారు. దీంతో 6వ తేదీన ప్రజా భవన్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు.