కవితకు నోటీసులు ఇస్తే తెలంగాణకు ఏం సంబంధం..? బీఆర్ఎస్‌పై భట్టి ఫైర్
కవితకు ఈడీ నోటీసులు ఇస్తే అది తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కవితకు ఈడీ నోటీసులు ఇస్తే అది తెలంగాణను అవమానించినట్లు ఎలా అవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో దేశానికి మాయని మచ్చ తీసుకువచ్చారని.. ఈ కేసులో చిక్కుకున్న వారంతా ఢిల్లీకే కాదు దేశానికే సమాధానం చెప్పాలన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కవిత నోటీసులకు తెలంగాణ సెంటిమెంట్‌కు లింక్ పెడుతున్న బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఇంత జరుగుతుంటే అన్నా హజారే ఎక్కడున్నారని ప్రశ్నించారు.
ఈ కుంభకోణంపై అన్నా హజారే స్పందించాలని డిమాండ్ చేశారు. అవినీతిని రూపుమాపుతామని వచ్చిన కేజ్రీవాల్.. ఆప్ పార్టీని పెట్టి అవినీతిలో కూరుకుపోయారని ధ్వజమెత్తారు. దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతిని కేజ్రీవాల్ చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయన్నారు. ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థల రూపంలో వెంటాడుతోందనేది నిజమే అయినా లిక్కర్ స్కామ్ విషయం వేరన్నారు. గతంలో సోనియా, రాహుల్ ఎలాంటి తప్పు చేయకపోయినా నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన భట్టి.. అలాంటి కామెంట్స్ ఎవరూ సమర్ధించరని చెప్పారు.